సంగీతం.. మన భావలను బట్టి తన తరంగాలతో ఉత్సాహం నింపే ఔషధం. ఎన్నో ఆనంద రాగాలు వినిపిస్తుంది. అలాంటి కోట్లాది సంగీత స్వరాలను అందించే 'గూగుల్ ప్లే మ్యూజిక్' వచ్చే ఏడాది నుంచి మీ ఫోన్లలో కనిపించదంటోంది గూగుల్. అయితే ఆ స్థానాన్ని 'యూట్యూబ్ మ్యూజిక్' భర్తీ చేయనుందట.
బదిలీ ఆఫర్ ఉందిగా..
గూగుల్.. ఈ ఏడాది ప్లే మ్యూజిక్‌ను తీసేసే యోచనలో ఉందని.. అదే ధరకు యూట్యూబ్ మ్యూజిక్‌తో భర్తీ చేయనుందని ఓ బ్లాగ్ పోస్ట్‌లో తెలిపింది యూట్యూబ్ మ్యూజిక్. అందుకే వినియోగదారులు తమ ప్లే లిస్ట్‌ను యూట్యూబ్ మ్యూజిక్కు బదిలీ చేసుకోవాలని కోరుతోంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలతో.. వినియోగదారులకు త్వరలో సందేశం అందుతుందని స్పష్టం చేసింది.
2011 నుంచి ప్లే మ్యూజిక్‌ను వినియోగిస్తున్నవారు తమకు నచ్చిన ఎన్నో పాటలను ప్లే లిస్ట్, లైబ్రరీ, పాడ్‌క్యాస్ట్‌లలో సేవ్ చేసుకుని ఉంటారు. మరి, ఇప్పుడు ఆకస్మాత్తుగా ప్లే మ్యూజిక్ మాయమైతే, ఆ పాటలను వినియోగదారులు కోల్పోవాల్సిందేనా? ఆ కంగారు అక్కర్లేదంటోంది యూట్యూబ్ మ్యూజిక్. ఆ పాటల జాబితాలను సులభంగా ప్లే మ్యూజిక్ నుంచి యూట్యూబ్ మ్యూజిక్కు బదిలీ చేసుకునే సదుపాయన్ని కల్పిస్తోంది.
సరికొత్తగా..
ఆల్బమ్స్, ప్రత్యక్ష ప్రదర్శనలు, రీమిక్స్‌లు, సినిమా పాటలు మొదలైనవన్నీ కలిపి... దాదాపు 5 కోట్ల మ్యూజిక్ ట్రాక్‌లను అందిస్తోంది యూట్యూబ్ మ్యూజిక్. గూగుల్ ప్లే మ్యూజిక్‌లో లేని సరికొత్త ఫీచర్లతో ముందుకు రానుంది. అంతే కాదు, వినియోగదారులు తమ మనసుకు నచ్చిన పాటలను ఎక్కువ సంఖ్యలో భద్రపరచుకునేలా ప్లే లిస్ట్ సామర్థ్యాన్ని 1000 నుంచి 5 వేలకు పెంచింది. లైబ్రరీలో.. లక్షకుపైగా పాటలను పొందుపరచుకోవచ్చు. పాటలు, మ్యూజిక్ వీడియోలు డౌన్లోడ్ చేసుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తోంది.
సంగీత ప్రియులు మొదటి ఆరు నెలలు యూట్యూబ్ మ్యూజిక్ ప్రీమియం ఉచితంగా ఆస్వాదించొచ్చు. ఆ తర్వాత నెలకు కేవలం రూ.99/- చెల్లిస్తే చాలు. ఇంటర్నెట్ లేని సమయంలోనూ పాటలు వినేందుకు రూ.129 ప్యాకేజ్ తీసుకుంటే సరిపోతుంది.
ఇదీ చదవండి:కూలీ కథ: బతుకు బరువైన వేళ భుజాలపై ఎడ్ల బండి