శాస్త్రవేత్తలు, ఆవిష్కర్తలు తమ పరిశోధనల పరిధిని మరింత విస్తృతం చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఈ విషయంలో ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు.
"మీ (శాస్త్రవేత్తలు) సామర్థ్యం అనంతం. మీరు అద్భుతాలు చేయగలరు. మీ పరిశోధనల పరిధిని విస్తృతం చేయండి. మీ పనితీరు పరామితులను మార్చండి. రెక్కలు చాపి ఎగరండి.. మీకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. నేను మీతో ఉన్నాను."- నరేంద్ర మోదీ, ప్రధాని
బెంగళూరులో డీఆర్డీఓ యువ శాస్త్రవేత్తల కోసం రూపొందించిన ప్రయోగశాలలను ఆ సంస్థ చీఫ్ సతీష్‌రెడ్డితో కలిసి మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తల శక్తిసామర్థ్యాలపై ప్రధాని ప్రశంసల జల్లు కురిపించారు.
భవిష్యత్ ఇంటెలిజెంట్ మెషీన్స్దే..
భవిష్యత్‌లో రక్షణ రంగంలో ఇంటెలిజెంట్ మెషీన్లు కీలక పాత్ర పోషిస్తాయని.. అటువంటి పరిస్థితుల్లో భారతదేశం ఏ మాత్రం వెనకబడి ఉండకూడదని మోదీ అన్నారు. దేశ పౌరులు, సరిహద్దులు, ఆసక్తులను రక్షించుకునేందుకుగాను నూతన ఆవిష్కరణలు చేయాలని, ఇందుకోసం తగిన పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉందని ప్రధాని స్పష్టం చేశారు.
డీఆర్డీఓ యంగ్ సైంటిస్ట్ లాబొరేటరీలు (డీవైఎస్‌ఎల్) బెంగళూరు, ముంబయి, చెన్నై, కోల్‌కతా, హైదరాబాద్‌ల్లో ఉన్నాయి. వీటిల్లో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో భవిష్యత్ రక్షణవ్యవస్థలను అభివృద్ధి చేస్తారు. 35 ఏళ్లలోపు వారు మాత్రమే ఇందులో చేరడానికి అర్హులు. వీరు ప్రత్యేకమైన పరిశోధన రంగాల్లో పనిచేయాల్సి ఉంటుంది.
ఇదీ చూడండి: ఈ నెల 17న నింగిలోకి జీశాట్-30: శివన్