సుదీర్ఘ చర్చలు, సంప్రదింపుల తర్వాత కేంద్ర ప్రభుత్వం.. నూతన వ్యవసాయ చట్టాలను రూపొందించి ఆమోదించిందని స్పష్టం చేశారు వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్. ఏళ్లుగా నష్టపోతున్న రైతును ఆదుకునేందుకే సాగు చట్టాలు తీసుకొచ్చామని పేర్కొన్నారు. కచ్చితంగా రైతులు.. ఈ చట్టాలతో మెరుగైన జీవనం పొందుతారని, వ్యవసాయ రంగానికి మేలు జరుగుతుందని ధీమా వ్యక్తంచేశారు.
నిరసనలతో సామాన్య ప్రజానీకానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని వ్యాఖ్యానించారు తోమర్. దిల్లీ ప్రజలు కష్టాలు ఎదుర్కొంటున్నారని, ఇకనైనా ఆందోళనలు విరమించి, చర్చలకు రావాలని ఆయన కోరారు. రైతుల అభ్యంతరాల మేరకు చట్టాల్లో మార్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పునరుద్ఘాటించారు.
''రైతులకు ప్రతిపాదనలు పంపాం. వారు దానిపై చర్చించినప్పటికీ ఇప్పటివరకు ఎటువంటి వివరణ ఇవ్వలేదు. అయితే.. రైతు సంఘాలు ప్రతిపాదనలను తిరస్కరించారని మీడియా ద్వారా తెలిసింది. మేం నిన్ననే చెప్పాం. వారు కోరుకుంటే ప్రభుత్వం చర్చలకు ఎప్పటికీ సిద్ధమేనని.
కచ్చితంగా పరిష్కారం దొరుకుతుంది. నేను నమ్మకంగా చెబుతున్నా. రైతు సంఘాలకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. మీరు విధించుకున్న గడువును రద్దు చేసుకోండి. చట్టాల్లో మీకున్న అభ్యంతరాలపై చర్చలు జరుపుదాం.''
- నరేంద్ర సింగ్ తోమర్, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి