ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో బెంగళూరు జైలులో ఉన్న శశికళ విడుదలపై ఎట్టకేలకు స్పష్టత వచ్చింది. ఆమె 2021 జనవరి 27న విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇందుకు ఆమె రూ. 10 కోట్ల జరిమానా చెల్లించాల్సి ఉంది.
వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి ఆమె నాలుగేళ్ల జైలు శిక్ష ముగియనుంది. అయితే శశికళ సహా ఆమె బృందాన్ని శిక్షాకాలానికి ముందే సత్ప్రవర్తన నిబంధనల కింద.. జనవరిలో అధికారులు విడుదల చేయనున్నారు.
10 కోట్లు కట్టగలరా?
ఆమె విడుదల తేదీపై స్పష్టత వచ్చినప్పటికీ జరిమానా రూ.10 కోట్లు శశికళ కట్టగలరా అనేది ప్రశ్న. ఇప్పటికే ఆమెను పార్టీ బహిష్కరించింది. ఆస్తులు, డబ్బు కోల్పోయారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఆమె అంత జరిమానా ఎలా కడతారు.
కోర్టు ఆదేశాలు...
జైలు నుంచి శశికళ విడుదల కావాలంటే ఆమె రూ.10 కోట్ల జరిమానా కట్టాలి. చెక్కు లేదా డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో జరిమానాను చెల్లించవచ్చు. అయితే ఇందుకు ఆదాయ పన్ను శాఖ నుంచి నిరభ్యంతర పత్రం తప్పక కావాలి. జరిమానా కట్టలేకుంటే మరో ఏడాది పాటు ఆమె జైలు శిక్ష అనుభవించాలని కోర్టు ఆదేశించింది. సుధాకరన్, ఇళవరసికి కూడా ఇవే నిబంధనలు వర్తిస్తాయి.
ఆర్టీఐ సమాచారం...
జైలు రికార్డుల ప్రకారం జరిమానా రుసుము చెల్లించిన పక్షంలో 2021 జనవరి 27న ఆమె విడుదల కావచ్చు. జరిమానా చెల్లించకపోతే మాత్రం 2022 ఫిబ్రవరి 22న విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు ఆర్టీఐ దరఖాస్తుకు బెంగళూరు కేంద్ర కారాగార సూపరింటెండెంట్ సమాధానమిచ్చారు. ఒకవేళ ఆమె పెరోల్ సదుపాయాన్ని వినియోగించుకుంటే ఈ తేదీల్లో మార్పు ఉండొచ్చు.
ఏంటి కేసు?
దివంగత ముఖ్యమంత్రి జయలలితపై ఉన్న ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆమె నెచ్చెలి శశికళ, ఇళవరసి, సుధాకరన్‌లు 2017 ఫిబ్రవరి 15 నుంచి బెంగళూరులోని పరప్పణ అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్నారు.
అన్నాడీఎంకేలో చీలికలు!
ఒకవేళ శశికళ ముందస్తుగా విడుదలైతే తమిళనాడు రాజకీయాల్లో, ముఖ్యంగా అన్నాడీఎంకేలో పెను ప్రకంపనలు సృష్టించే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఎడప్పాడి పళనిస్వామి సహా ఆయన వర్గంలోని పలువురు 'చిన్నమ్మ' నమ్మిన బంటులుగా ఉన్నారని, ఆమె విడుదలైతే మళ్లీ అన్నాడీఎంకేలో చీలికలు ఖాయమనే ప్రచారమూ ఉంది.