దిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం-జేఎన్యూలో జరిగిన దాడిపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. పలు ప్రాంతాల్లో విద్యార్థులు నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. వర్సిటీ విద్యార్థులకు సంఘీభావంగా కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహిస్తున్నారు.
జేఎన్యూలో దాడిని తీవ్రంగా ఖండించారు కేరళ సీఎం పినరయి విజయన్. విశ్వవిద్యాలయాల్లో రక్తపాతం సృష్టించే దాడుల నుంచి సంఘ్ పరివార్ వైదొలగాలని ఆయన సూచించారు. దేశంలో అశాంతి, హింసను సృష్టించాలనుకునే వారే విద్యార్థులు, ఉపాధ్యాయులపై దాడి చేశారని ఆరోపించారు విజయన్. ఈ ఘటనను నాజీ తరహా దాడిగా అభివర్ణించారు.
దాడి సిగ్గుచేటు..
విద్యార్థులు, టీచర్లపై దాడి ఘటనను బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి కూడా ఖండించారు. ఈ హింసాత్మక దాడి ఘటనపై న్యాయ విచారణ జరిపించి వాస్తవాలను నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన సిగ్గుచేటు అని ఆగ్రహం వ్యక్తం చేశారు మాయావతి. కేంద్ర ప్రభుత్వం ఈ దాడిని తీవ్రంగా పరిగణించి న్యాయ విచారణకు ఆదేశించాలని ట్వీట్ చేశారు.