చైనా నుంచి తరలించి.. దిల్లీ సమీపంలో ఆర్మీ క్యాంపుల్లో ఉంచిన వారికి అన్ని పరీక్షలు పూర్తయినట్లు అధికారులు ప్రకటించారు. కరోనా వైరస్ ప్రధాన కేంద్రమైన చైనాలోని వుహాన్ నుంచి తరలించిన 600 మందికి ఈ కేంద్రంలో 14 రోజులపాటు వైద్యులు పరీక్షలు నిర్వహించారు.
వైరస్ ప్రభావం లేదు..
సోమవారం మధ్యాహ్నం తుది పరీక్షలు నిర్వహించిన అధికారులు.. వీరిలో ఏ ఒక్కరికీ వైరస్ ప్రభావం ఉన్నట్లు తేలలేదని వెల్లడించారు. సాయంత్రం నుంచి ఈ రెండు క్యాంపుల్లో ఉన్న 400 మందిని స్వస్థలాలకు వెళ్లేందుకు అనుమతించినట్లు తెలిపారు. ఇవాళ 200 మంది తమ ఇళ్లకు చేరుకోనున్నారు.
వైరస్ లక్షణాలు లేవని తేలిన సందర్భంగా క్యాంపుల్లో ఉన్నవారు ఆనందం వ్యక్తం చేశారు. ఇళ్లకు వెళ్లిపోతున్నామన్న సంతోషంలో తోటివారితో నృత్యాలు చేశారు.
రెండు దఫాలుగా..
చైనాలో కరోనా వైరస్ వెలుగు చూసిన అనంతరం అక్కడ చిక్కుకున్న వారిని.. జనవరి 31, ఈనెల 2న రెండు దఫాలుగా వుహాన్ నుంచి తరలించారు. అలా వచ్చిన వారి కోసం కేంద్ర ప్రభుత్వం... ఐటీబీపీ, సీఆర్పీఎఫ్ నేతృత్వంలో దిల్లీలోని మనేసర్, చావ్లా వద్ద రెండు క్యాంపులు ఏర్పాటు చేసింది. వీరితో పాటు చైనా నుంచి వచ్చిన ఏడుగురు మాల్దీవులకు కూడా చికిత్స అందించారు. వైరస్ ప్రభావం లేకపోవడం వల్ల వారిని కూడా స్వస్థలానికి అనుమతించారు.
ఇదీ చూడండి: కరోనా: చైనాలో 1,860కి చేరిన మృతులు