మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత హెచ్ డీ దేవెగౌడ రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కర్ణాటక నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే, ఇద్దరు భాజపా నేతలు కూడా పోటీ లేకుండానే రాజ్యసభకు వెళ్లనున్నారు.
కర్ణాటకలో నాలుగు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. బరిలో నలుగురే ఉన్నారు. దీంతో జేడీఎస్ నుంచి దేవెగౌడ, కాంగ్రెస్ నుంచి మల్లికార్జున ఖర్గే, భాజపా నుంచి ఇరన్నా కదాది, ఆశోక్ గస్తీల ఎన్నిక ఏకగ్రీవమైనట్లు అధికారులు వెల్లడించారు. నామినేషన్ ఉపసంహరణకు గడువు ముగిసింది. షెడ్యూల్ ప్రకారం జూన్ 19న ఎన్నికలు జరగాల్సి ఉంది.
కర్ణాటక అసెంబ్లీలో స్పీకర్‌తో కలిపి భాజపా సంఖ్యాబలం 117గా ఉంది. కాంగ్రెస్‌కు 68, జేడీఎస్‌కు 34 మంది సభ్యులున్నారు. ఒక్కో రాజ్యసభ సీటు గెలవాలంటే కనీసం 45 మంది సభ్యుల బలం కావాల్సి ఉంది. జేడీఎస్‌కు గెలిచే అవకాశం లేకపోయినప్పటికీ, ఆ పార్టీకి కాంగ్రెస్ మద్దతుగా నిలిచింది.
కాంగ్రెస్ సీనియర్ నేత ఖర్గే రాజ్యసభకు వెళ్లడం ఇది మొదటిసారి. 87 ఏళ్ల దేవెగౌడ రాజ్యసభకు వెళ్తుండటం ఇది రెండోసారి. 1996లో ఆయన ప్రధానిగా ఉన్నప్పుడు రాజ్యసభలో తొలిసారి అడుగుపెట్టారు. గతేడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో దేవెగౌడ, ఖర్గే ఇద్దరూ ఓటమి పాలయ్యారు.