తమిళనాడు తూత్తుకుడి జిల్లా సత్తానుకులంలో పోలీసుల అమానవీయ చర్య కారణంగా కస్టడీలో ప్రాణాలు కోల్పోయిన తండ్రీ కొడుకులు జయరాజ్, ఫెనిక్స్ మృతి పట్ల ఆ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఘటనకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని బాధితుల కుటుంబ సభ్యులు, ప్రజలు, రాజకీయ నాయకులు, ప్రముఖులు డిమాండ్ చేస్తున్నారు. వీలైనంత త్వరగా న్యాయం చేయాలని సామాజిక మాధ్యమాల వేదికగా గళమెత్తుతున్నారు.
అమెరికాలో జార్జి ఫ్లాయిడ్ తరహాలో!..
అమెరికాలో పోలీసుల కర్కశానికి నల్లజాతీయుడు జార్జి ఫ్లాయిడ్ బలైన తరహాలోనే తమిళనాడులో పోలీసుల క్రూరత్వానికి జయరాజ్, ఫెనిక్స్ ప్రాణాలు కోల్పోయారని ప్రముఖ సింగర్ సుచిత్ర అన్నారు. ఘటనకు కారణమైన పోలీసులను సస్పెండ్, బదిలీ చేస్తే సరిపోదని.. వాళ్లని కఠినంగా శిక్షిస్తేనే న్యాయం జరిగినట్లని వీడియో సందేశాన్ని విడుదల చేశారు. బాధిత కుటుంబాలకు సరైన న్యాయం జరిగేంత వరకూ గళమెత్తాలన్నారు.
జయరాజ్, ఫెనిక్స్ మృతికి సంతాపం తెలుపుతూ పోలీసుల చర్యను తీవ్రంగా ఖండించారు తమిళనాడులోని కోలివుడ్ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
జయరాజ్, ఫెనిక్స్ ఘటనలో ఆలస్యం జరగకుండా దోషులకు శిక్ష పడుతుందా? నిందితులు తప్పించుకోవడానికి వీల్లేదు. ఒక కుటుంబం అమితంగా ప్రేమించే వారిని కోల్పోయింది. ఆలస్యమైతే న్యాయం జరగనట్లే.
-కుష్పూ ట్వీట్.
ఈ ఘటనను అమానవీయ చర్య అన్నారు నటుడు జయం రవి. చట్టానికి ఎవరూ అతీతులు కాదని, బాధిత కుటుంబానికి న్యాయం జరగాలని ట్వీట్ చేశారు.
జయరాజ్, ఫెనిక్స్‌ల మృతి ఘటన అమానవీయం, అనాగరికం. వాళ్లు ఎంత బాధ అనుభవించి ఉంటారో ఊహించుకోవడం కూడా కష్టం. ఇలాంటి క్రూరమైన చర్యలకు పాల్పడిన వారిని శిక్షించకుండా వదిలేయడానికి వీల్లేదు.
-శ్రుస్తి దాంగే, నటి.
ఈ ఘటనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ట్విట్టర్లో స్పందించారు. పోలీసుల చర్య భయానకమన్నారు.
పోలీసుల క్రూరత్వం భయానక నేరం. మన రక్షకులు అణచివేతదారులుగా మారడం విషాదకరం. బాధితుల కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నా. వారికి న్యాయం జరిగేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా.
-రాహుల్ గాంధీ ట్వీట్.
ఇదీ జరిగింది..
జూన్ 19న రాత్రి 7:30గంటల సమయంలో జయరాజ్(60), అతని కుమారుడు ఫెనిక్స్(30) తమ సెల్‌ఫోన్ షాపును తెరిచి ఉంచారు. లాక్డౌన్ ఆంక్షలను అతిక్రమించి సమయం దాటినా దుకాణాన్ని ఇంకా ఎందుకు మూసివేయలేదని సబ్ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులు జయరాజ్‌పై దాడి చేశారు. అతడిని సత్తానుకులంలోని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తన తండ్రిని విడుదల చేయాలని స్టేషన్‌కు వెళ్లిన ఫెనిక్స్ పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. దీంతో ఆగ్రహించిన పోలీసులు ఇద్దరినీ అరెస్టు చేశారు.
కస్టడీలో ఉన్నప్పుడు జయరాజ్, ఫెనిక్స్‌లను పోలీసులు తీవ్రంగా హింసించారని స్థానికులు తెలిపారు. వారిని కొవిల్పత్తి జైలుకు తరలించిప్పుడు గాయాలతో ఉన్నారని చెప్పారు. ఛాతినొప్పితో బాధపడుతున్నాడని జూన్ 22న జయరాజ్‌ను కొవిల్పత్తి ఆస్పత్రికి తరలించారు పోలీసులు. అతడు మృతిచెందాడని వైద్యులు ప్రకటించారు. ఆ మరునాడే అదే ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న ఫెనిక్స్ కుడా చనిపోయాడు.
ఫెనిక్స్ జైల్లో ఉన్నప్పడు తీవ్ర గాయాలతో బాధపడినట్లు, రక్తస్రావం కూడా అయినట్లు అతన్ని చూసేందుకు వెళ్లిన స్నేహితుడు తెలిపారు.
ఈ విషయం తెలిసిన అనంతరం తమిళనాడు వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. పోలీసుల చర్యను నిరసిస్తూ జయరాజ్, ఫెనిక్స్‌ల మృతదేహాలను తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యులు తొలుత నిరాకరించారు. ఈ కేసులో పారదర్శకమైన విచారణ జరిపిస్తామని కోర్టు హామీ ఇచ్చాక అంగీకరించారు. పోలీసుల క్రూరత్వాన్ని వ్యతిరేకిస్తూ సమాజిక మాధ్యమాల్లో #JusticeFoeJayrajAnFenix హ్యాష్‌ట్యాగ్‌తో నిరసనలు వ్యక్తమయ్యాయి.
ఈ ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి విచారం వ్యక్తం చేశారు. బాధితుల కుటుంబానికి సంతాపం తెలిపారు. రూ.10లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. ఘటనతో సంబంధమున్న ఇద్దరు పోలీసులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. మరికొందరిని బదిలీ చేసింది.