తొలిసారిగా భారతదేశ పర్యటనకు వస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. అహ్మదాబాద్, దిల్లీతో పాటు ఆగ్రాకూ వెళ్లనున్నారు. ప్రపంచ ప్రఖ్యాత తాజ్‌మహల్‌ను ఆయన సతీ సమేతంగా సందర్శిస్తారు. 24వ తేదీన ఆయన నేరుగా అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు. ప్రోటోకాల్‌ను పక్కనపెట్టి ట్రంప్ దంపతులకు ప్రధాని నరేంద్రమోదీ అక్కడ స్వాగతం పలకనున్నారు. దాదాపు 22 కి.మీ. మేర సాగే రోడ్‌షోలో వారికి భారీ సంఖ్యలో ప్రజలు స్వాగతం పలుకుతారు.
ఆగ్రాలో స్వాగతం పలకున్న యోగి
అహ్మదాబాద్ పర్యటనలో భాగంగా సబర్మతి ఆశ్రమానికి ట్రంప్, మోదీ వెళ్తారు. వివిధ వర్గాల వారితో ముచ్చటిస్తారు. భారీ క్రికెట్ స్టేడియంలో నిర్వహించే ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమంలో ప్రసంగిస్తారు. ఆ తర్వాత ట్రంప్ దంపతులు ఆగ్రాకు వెళ్తారు. ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ వారికి అక్కడ స్వాగతం పలుకుతారు.
వాటిపైనే ప్రధాన చర్యలు?
తాజ్ సందర్శనానంతరం ట్రంప్ దిల్లీకి వెళ్తారు. 25వ తేదీన రాష్ట్రపతి భవన్‌లో ఆయనకు సంప్రదాయబద్ధ స్వాగతం లభిస్తుంది. అనంతరం రాజ్‌ఘాట్ వద్దకు వెళ్లి మహాత్మాగాంధీకి ఆయన నివాళులు అర్పిస్తారు. హైదరాబాద్ హౌస్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోదీతో ఆయన జరిపే చర్చల్లో రక్షణ రంగం, ఇంధన సంబంధిత అంశాలు ప్రధానంగా చర్చకు రానున్నాయి. అక్కడే విందు స్వీకరించి, కొందరు నేతలతో మర్యాద పూర్వకంగా భేటీ అవుతారు. అధికారిక చర్చలు ముగిసిన అనంతరం మన దేశానికి చెందిన కొందరు సీఈవోలతో, అమెరికా రాయబార కార్యాలయ అధికారులతో సమావేశమవుతారు. దిల్లీలోని ప్రభుత్వ పాఠశాలను ట్రంప్ సతీమణి సందర్శించే అవకాశం ఉంది. తర్వాత ట్రంప్ దంపతులు అమెరికాకు బయల్దేరుతారు.
ఇదీ చూడండి: నమస్తే ట్రంప్: అధ్యక్షుడి పర్యటనకు ఏర్పాట్లు ఇలా...