దేశంలో రానురానూ రహదారి భద్రత పెనుసమస్యగా మారడంతో సరైన పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వం ఏళ్ల తరబడి ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా ప్రయాణికులు, సరకుల రవాణా వేగంగా, సురక్షితంగా, చవకగా జరిగేట్లు చూడటానికి 2014లో రోడ్డు రవాణా, భద్రత బిల్లును ప్రవేశపెట్టింది. రోజురోజుకూ పెరిగిపోతున్న ప్రమాదాలు, మరణాలను నియంత్రించేందుకు కొత్త చట్టాలు తెస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2015లో ప్రకటించారు. గడచిన నాలుగైదేళ్లలో తగిన మార్పులు చేర్పులతో ఖరారైన మోటారు వాహనాల సవరణ బిల్లు (2019)కు గత నెల 31న పార్లమెంటు ఆమోద ముద్ర వేసింది. ఇది రాష్ట్రపతి ఆమోదం పొంది చట్టంగా మారిన తరవాత- పాదచారులకు, వాహన చోదకులకు రహదారులు సురక్షితమైనవిగా మారే అవకాశాలు ఉన్నాయి. ఈ బిల్లు చట్టమయ్యాక కొత్త వాహనాలను డీలర్ల స్థాయిలోనే రిజిస్టర్ చేస్తారు. దీనివల్ల కొనుగోలుదారులకు రిజిస్ట్రేషన్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన ఇబ్బంది తప్పుతుంది.
నిబంధనలను అతిక్రమించే వాహన చోదకులపై కొత్త బిల్లు భారీ జరిమానాలు ప్రతిపాదిస్తోంది. అంబులెన్సుల వంటి అత్యవసర వాహనాలకు దారి ఇవ్వకపోతే రూ.10,000 జరిమానా విధించడానికి బిల్లు అవకాశం కల్పిస్తోంది. వాహనం నడపడానికి అనర్హులని ప్రకటించినా లెక్కచేయకుండా నడిపేవారి పైన రూ.10,000 జరిమానా విధిస్తారు. ఓలా, ఉబర్ వంటి సంస్థలు డ్రైవింగ్ లైసెన్సులు లేకుండా వాహనాలు నడిపితే లక్ష రూపాయల వరకు జరిమానా విధిస్తారు. అతి వేగంతో నడిపేవారు వెయ్యి నుంచి రెండు వేల రూపాయల వరకు అపరాధ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. 18 రాష్ట్రాల రవాణా మంత్రుల సిఫార్సులను పార్లమెంటు స్థాయీసంఘం విస్తృతంగా పరిశీలించిన అనంతరం ఈ బిల్లు రూపకల్పన జరిగింది.
ఆస్తి నష్టమూ అధికమే
బీమా లేకుండా వాహనం నడిపితే రూ.2,000 జరిమానా కట్టాల్సి ఉంటుంది. హెల్మెట్లు లేకుండా నడిపితే రూ.1,000 అపరాధ రుసుము విధించడమే కాకుండా మూడు నెలలపాటు డ్రైవింగ్ లైసెన్సును రద్దు చేస్తారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వారికి గతంలో రూ.100 జరిమాన విధించేవారు. దీనిని రూ.500లకు పెంచారు. నిబంధనలను ధిక్కరించిన వారు గతంలో రూ.500 అపరాధ రుసుం చెల్లించేవారు. ఇకపై కనీసం రూ.2,000 కట్టాల్సి ఉంటుంది. ప్రమాదకరంగా వాహనాన్ని నడిపితే ఇంతకు ముందు విధించే జరిమానాను రూ.1,000 నుంచి రూ.5,000కు పెంచారు. మద్యం తాగి వాహనం నడిపితే రూ.10,000 జరిమానా విధించాలని కొత్త బిల్లు నిర్దేశిస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా ఏటా రహదారి ప్రమాదాల్లో 13.5 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నట్లు అంచనా. భారత్‌లో ఒక్క 2018లోనే దాదాపు 1,49,000 మంది చనిపోయారు. ప్రపంచంలోని మోటారు వాహనాల్లో రెండు శాతం మాత్రమే భారత్‌లో తిరుగుతున్నా, మొత్తం రహదారి ప్రమాద మరణాల్లో 11 శాతం ఇక్కడే జరగడం ఆందోళన కలిగిస్తోంది. ప్రమాదాల్లో గాయపడి అంగవికలురయ్యే వారు పెద్ద సంఖ్యలో ఉంటున్నారు. భారీ ఆస్తి నష్టం సరేసరి. 2015లో దేశంలో మోటారు వాహనాలు, రైళ్లు ఢీకొన్న ఘటనలు 4,96,762 వరకు సంభవించాయని జాతీయ నేరగణాంకాల సంస్థ (ఎన్.సి.ఆర్.బి) 2016 నివేదిక తెలిపింది. వీటిలో రహదారుల మీద వాహనాలు ఢీకొన్న ఘటనలే 4,64,674 వరకు ఉన్నాయనీ, వీటివల్ల 1,48,707 మరణాలు సంభవించాయని అది వివరించింది. ఈ ప్రమాదాలకు మితిమీరిన వేగం, మద్యం సేవించి నడపడం, శిరస్త్రాణాలు, సురక్షిత బెల్టులు ధరించకపోవడమే ప్రధాన కారణాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ప్రధాన రహదారులపై నిర్దేశిత వరుసలో నడపకపోవడం, మలుపు తిరిగేటప్పుడు ఇతర వాహనాలకు దారి ఇవ్వకపోవడం వల్ల నాలుగు లైన్ల జాతీయ రహదారులపై ప్రమాదాలు సంభవిస్తున్నాయని పేర్కొన్నది.
స్వీడన్, ఆస్ట్రేలియా, బ్రిటన్‌లలో ప్రభుత్వాలు సమర్థమైన చట్టాలు తీసుకురావడం వల్ల ఆయా దేశాల్లో రహదారి భద్రత మెరుగుపడింది. మోటారు వాహనాల చట్టాన్ని సవరించేందుకు భారత్ రెండు దశాబ్దాలుగా మల్లగుల్లాలు పడుతోంది. 2014 జూన్‌లో అప్పటి కేంద్ర మంత్రి గోపీనాథ్ ముండే రహదారి ప్రమాదంలో మరణించినప్పటి నుంచి ఈ ప్రయత్నాలు ఊపందుకున్నాయి. దీనికితోడు 2020కల్లా రహదారి ప్రమాద మరణాలను సగానికి సగం తగ్గించాలంటున్న బ్రెసీలియా ఒప్పందంపై భారత్ సంతకం చేయడంతో కొత్త బిల్లు రూపకల్పన జోరందుకుంది. దేశంలో మోటారు వాహనాలు క్రమంగా పెరుగుతున్న సమయంలో 1988లో మోటారు వాహనాల చట్టం తీసుకువచ్చారు. ప్రయాణికులు, సరకుల రవాణాను పెంచే ఉద్దేశంతో రూపొందిన ఆ చట్టం రహదారి భద్రతకు ప్రాధాన్యం ఇవ్వలేదు.
జరిమానాల వడ్డన
మోటారు వాహనాల సవరణ బిల్లు (2019) భారీ జరిమానాలు వడ్డించడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. మద్యం తాగి వాహనం నడపడం, అతి వేగం వంటి నేరాలకు ఇంతవరకు దేశంలో విధిస్తున్న జరిమానాలు ఇతర దేశాల్లోకన్నా తక్కువగా ఉన్నాయి. ప్రమాదాలు నివారించి, భద్రత పెంచాలంటే జరిమానాల మొత్తాన్ని పెంచాలని శాసనకర్తలు భావించారు. వాహనాల చోదకులు, సైకిళ్ల వినియోగదారులు, పాదచారులకు తప్పనిసరిగా బీమా కల్పించడానికి మోటారు వాహనాల ప్రమాద బీమా నిధిని ఏర్పాటు చేయాలని బిల్లు నిర్దేశిస్తోంది. ప్రమాదాల్లో గాయపడిన వారి చికిత్సకు, చనిపోయిన వారి కుటుంబీకులకు ఈ నిధి నుంచి పరిహారం చెల్లిస్తారు. ప్రమాద బాధితులకు అత్యవసర వైద్య చికిత్సను, ఇతరత్రా సహాయాన్నీ అందించిన వారికి సివిల్, క్రిమినల్ కేసుల బారి నుంచి బిల్లు రక్షణ కల్పిస్తోంది. బాలలు వాహనాలు నడిపి ప్రమాదానికి కారకులైతే వారి సంరక్షకులు లేదా సదరు వాహనాల యజమానులు కేసులను ఎదుర్కోవలసి ఉంటుంది.
వాహన చోదకులు, వాహనాలు, మౌలిక వసతులను దృష్టిలో పెట్టుకొని మోటారు వాహనాల సవరణ బిల్లును రూపొందించారు. మొదటగా రహదారి భద్రత, రవాణా నిర్వహణలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సలహా ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులతో ఒక బోర్డును నియమించాలని బిల్లు నిర్దేశిస్తున్నది. రోడ్డు రవాణా రంగానికి ప్రాధాన్యాలు నిర్ణయించడానికి, పర్మిట్లు ఇవ్వడానికి, ప్రణాళికా రచనకు జాతీయ రవాణా విధానాన్ని రూపొందించే అధికారాన్ని బిల్లు కేంద్ర ప్రభుత్వానికి కల్పిస్తోంది. పటిష్ఠమైన రహదారుల నిర్మాణం, నిర్వహణలతోనే రహదారి భద్రత మెరుగుపడుతుందని బిల్లు భావిస్తోంది. తదనుగుణంగా గుత్తేదారులు, సలహాదారులు భద్రమైన రహదారులను నిర్మించి, నిర్వహించకపోతే 1,500 డాలర్ల వరకు జరిమానా విధించనున్నారు. గ్రామాలు, పట్టణాల్లో ప్రజా రవాణా సేవలను మెరుగుపరచడానికి కొత్త తరహా పర్మిట్లు మంజూరు చేస్తారు. సొంత వాహనంలో వెళ్లేవారికి ప్రమాద అవకాశం ప్రతి కిలోమీటరుకూ పెరిగితే, బస్సులు, రైళ్ళవంటి ప్రజా రవాణా వాహనాల్లో పయనించేవారికి ముప్పు తగ్గడంతోపాటు ప్రయాణాల సంఖ్యా తగ్గుతుందని పరిశోధనల్లో వెల్లడైంది. డిజైన్ లోపాల వల్లనో, కాలుష్య ఉద్గారాల వల్లనో ప్రయాణికుల భద్రతకు, ఆరోగ్యానికి భంగం కలిగించే మోటారు వాహనాలను వెనక్కు రప్పించేందుకు ఉత్పత్తిదారులను ఆదేశించే అధికారాన్ని కొత్త బిల్లు ఇస్తోంది. నిర్దేశిత ప్రమాణాల ప్రకారం వాహనాలు తయారు చేయని సంస్థలపై కోటిన్నర డాలర్ల (దాదాపు 100 కోట్ల రూపాయల) వరకు జరిమానా విధించే వీలు కల్పించింది. ఉబర్, ఓలా వంటి సంస్థలను బిల్లు సాధికారంగా గుర్తించినందున, వాటి నియంత్రణకు వెసులుబాటు ఏర్పడింది. వాహన చోదకుల పని గంటలు, ప్రయాణికుల సమాచార (డేటా) పంపకం, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన, అతి వేగ నిరోధం వంటి అంశాల్లో తగిన నిబంధనలు రూపొందించడానికి మార్గం సుగమమైంది.
ఆన్‌లైన్‌లో లైసెన్సులు
డ్రైవింగ్ లైసెన్సుల మంజూరు తదితర సేవలను ఆన్‌లైన్‌లో నిర్వహించాలని బిల్లు ప్రతిపాదిస్తోంది. ఆన్‌లైన్‌లోనే వ్యక్తుల గుర్తింపు నిర్ధారణ జరిపి లెర్నింగ్ లైసెన్సులు జారీచేస్తారు. డ్రైవింగ్ పరీక్షలను కంప్యూటరీకరించి బోగస్ లైసెన్సులకు అడ్డుకట్ట వేస్తారు. ఈ-పాలన ద్వారా పారదర్శకతకు బిల్లు ప్రాధాన్యం ఇచ్చింది. వాణిజ్య వాహనాల లైసెన్సులను ఇప్పుడున్న మూడేళ్ల నుంచి అయిదేళ్లకు పెంచాలని ప్రతిపాదించింది. లైసెన్సు మురిగిపోవడానికి ఏడాది ముందు కానీ, తరవాత కానీ దాన్ని పునరుద్ధరించుకునే వీలు కల్పిస్తోంది. సమర్థులైన వాహన చోదకులను తయారు చేసుకోవడానికి మరిన్ని శిక్షణ సంస్థలను నెలకొల్పుతారు. రోడ్డు ప్రమాదాల వల్ల ప్రాణ నష్టమే కాదు, భారీ ఆర్థిక నష్టమూ సంభవిస్తోంది. ఈ నష్టం భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో మూడు శాతం మేరకు ఉంది. 1999-2000 సంవత్సరాలలో రోడ్డు ప్రమాదాల వల్ల జరిగిన ఆర్థిక నష్టం రూ. 55,000 కోట్లని ప్రణాళికా సంఘం లెక్కగట్టింది. 2012లో అంతర్జాతీయ రహదారి సమాఖ్య కూడా భారతదేశం ఏటా 2,000 కోట్ల డాలర్ల ధన నష్టాన్ని చవిచూస్తోందని తెలిపింది. ఈ నష్టాలను శాశ్వత ప్రాతిపదికన నివారించడమే లక్ష్యంగా మోటారు వాహనాల సవరణ బిల్లును రూపొందించారు.
ఇదీ చూడండి:హాంగ్కాంగ్ హింసాయుతం- రవాణా బంద్!