కరోనా వైరస్‌పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ముందడుగు వేస్తున్నాయి. సాంకేతికత సాయంతో పాటు ఫ్లెక్సీల ఏర్పాటు, గోడ ప్రకటనలు, వాహనాలతో ప్రచారాలు, వీడియోలు, పాటల ద్వారా మహమ్మారి గురించి ప్రజలకు వివరిస్తున్నాయి. యువత ఎక్కువగా సామాజిక మాధ్యమాల్లో ఉంటున్నారని భావించిన తమిళనాడులోని తిరుపుర్ పోలీసులు.. వినూత్నంగా ఓ ప్రాంక్ వీడియోను విడుదల చేశారు. ఇది నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది.
రోడ్లపైకి వచ్చేటప్పుడు మాస్కులు వేసుకోవాలి, సబ్బుతో చేతులను శుభ్రంగా కడుక్కోవాలి, ముఖాన్ని తాకొద్దు, దగ్గేటప్పడు మోచేతిని అడ్డుపెట్టుకోండి వంటి ఎన్నో సూచనలు చేసింది ఆరోగ్యశాఖ. అయినా వాటిని కొంతమంది పెడచెవిన పెడుతున్నారు. అందుకే తాజాగా తీసిన వీడియోలో మాస్కు పెట్టుకోకపోతే ఏం జరుగుతుంది? వైరస్ వస్తే ఆ భయం ఎలా ఉంటుంది? అనేది పోలీసులు ఈ వీడియో ద్వారా చెప్పారు.