వెలికి తీయాలే కానీ ప్రతి ఒక్కరిలో ఏదో ఓ కళ దాగే ఉంటుంది. కేరళ ఎర్నాకుళం జిల్లా త్రిక్కరియూర్కు చెందిన 15ఏళ్ల కుర్రాడు జిష్నూ ఇందుకు ఉదాహరణగా నిలుస్తున్నాడు.
వాహనాలు, ఇతర వస్తువుల కళాకృతులను తయారు చేస్తూ.. అందర్నీ ఆకర్షిస్తున్నాడు ఈ కుర్రాడు. కార్లు, బస్సులు, ఆటోలు ఇలా అన్నింటి నమూనాలను అచ్చం నిజమైన వాటిలానే రూపొందిస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు. వీటన్నింటిని వ్యర్థ వస్తువులను ఉపయోగించి తయారు చేస్తుండటం మరో విశేషం.
ఆరో తరగతి నుంచే జిష్నూ కళాకృతులను తయారు చేయడం ప్రారంభించాడు. బయటివైపు మాత్రమే కాకుండా.. వస్తువుల లోపలివైపు కూడా నిజమైన వాటిని పోలినట్లు ఆకృతులను తయారు చేయడం జిష్నూ ప్రత్యేకత. ఈ కుర్రాడు తయారు చేసిన కళాఖండాలను నిజమైన వాటితో పోల్చినప్పుడు.. తేడా గుర్తించడం చాలా కష్టమంటున్నారు స్థానికులు.
మినియేచర్ మోడలింగ్‌లోకి వచ్చేందుకు తన తండ్రే తనకు ఆదర్శం అని అంటున్నాడు జిష్నూ. చిన్న వయస్సులో తన తండ్రి తన కోసం కళాకృతులను తయారు చేయడం చూసి.. తనకూ ఆసక్తి పెరిగిందని చెప్పాడు. జిష్నూ ప్రస్తుతం తమ సమీపంలోని ఓ ఇంటి కళాకృతిని తయారు చేసే పనిలో ఉన్నాడు. చిత్రలేఖనంలో కూడా జిష్నూకు ప్రావీణ్యం ఉంది.