ఫార్మసీ విద్యపై నియంత్రణాధికారం పూర్తిగా ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీసీఐ) పరిధిలోకి వస్తుంది తప్పితే.. అది అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) పరిధిలోకి రాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈమేరకు జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ ఎంఆర్ షాలతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఫార్మసీ డిగ్రీలు, డిప్లొమాల గుర్తింపునకు సంబంధించి ఫార్మసీ చట్టం-1948 చెల్లుబాటు అవుతుందని పేర్కొంది. ఫార్మసీ విద్యకు ఫార్మసీ యాక్ట్-1948 వర్తింపజేయాలా, లేదంటే ఏఐసీటీఈ చట్టం-1987ను అనుసరించాలా అన్న అంశంపై స్పష్టత కోరుతూ పీసీఐ దాఖలు చేసిన కేసులో ఈమేరకు తీర్పు ఇచ్చింది.
ఏఐసీటీఈ సాంకేతిక విద్యాసంస్థకు చెందినది...
ఫార్మసీ రంగానికి సంబంధించి ఫార్మసీ చట్టం ప్రత్యేకమైందని, అందువల్ల ఆ రంగానికి సంబంధించిన విద్యపై ఏఐసీటీఈకి బదులు దీనికే అధికారాలు ఉంటాయని స్పష్టం చేసింది. ఏఐసీటీఈ అన్నది కేవలం సాంకేతిక విద్యాసంస్థలకు సంబంధించిన చట్టం మాత్రమేనని పేర్కొంది. ఏఐసీటీఈ చట్టంలో సాంకేతిక విద్యతోపాటు, ఫార్మసీ అన్న అంశాన్ని చేర్చినందున ఫార్మసీ చట్టం రద్దయినట్లేనని ఏఐసీటీఈ చేసిన వాదనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఫార్మసీ చట్టాన్ని రద్దుచేసినట్లు ఏఐసీటీఈ చట్టంలో ఎక్కడా ప్రత్యేకంగా పేర్కొనలేదని గుర్తుచేసింది. ఈ రెండూ కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టాలేనని, అలాంటివి ఆధిపత్యం కోసం పరస్పరం పోటీపడటం ఏమాత్రం ఆరోగ్యకరం కాదని వ్యాఖ్యానించింది.
ఫార్మసీ విద్యకు సంబంధించిన డిగ్రీ, డిప్లొమా గుర్తింపు విషయంలో ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా జారీచేసిన నిబంధనలనే సంబంధిత అధికారులు అనుసరించాలని స్పష్టం చేసింది. ఫార్మసీ కాలేజీల్లో సీట్ల పెంపు, తగ్గింపు అంశాల్లోనూ పీసీఐ జారీచేసే ఉత్తర్వులనే విద్యాసంస్థలు అనుసరించాలని పేర్కొంది. ఒకవేళ ఇప్పటికే ఏఐసీటీఈ ఆమోదించిన విద్యార్థుల సంఖ్యను పీసీఐ ఆమోదించకపోతే వచ్చే విద్యాసంవత్సరం కోసం నాలుగు వారాల్లోపు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని ఆదేశించింది. గుర్తింపు, కోర్సుల అనుమతి, సాయంత్రం షిఫ్ట్ నిర్వహణకు అనుమతివ్వడం అంతా పీసీఐ పరిధిలోకే వస్తుందని స్పష్టం చేసింది.