నిర్భయ కేసు దోషులకు ఈనెల 20న ఉరి శిక్ష అమలు చేసేందుకు మార్గం సుగమమైంది. మరణశిక్ష నుంచి తప్పించుకునే లక్ష్యంతో నలుగురు దోషుల్లో ఒకడైన ముకేశ్ కుమార్ సింగ్ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ పిటిషన్‌కు విచారణ అర్హత లేదని స్పష్టంచేసింది.
ముకేశ్ ఎత్తుగడ
నలుగురు దోషుల్లో ఒకడైన ముకేశ్ కుమార్ సింగ్.. తనకు ఉన్న న్యాయపరమైన అన్ని అవకాశాలను పునరుద్ధరించాలని ఈనెల 6న సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఈ విషయంలో తన న్యాయవాది తనను తప్పుదారి పట్టించారని ఆరోపించాడు. రివ్యూ పిటిషన్‌లను తిరస్కరించిన తర్వాత క్యురేటివ్ పిటిషన్‌లను దాఖలు చేసేందుకు మూడేళ్ల వరకు గడువు ఉంటుందని తెలిపిన ముకేశ్.. అందువల్ల 2021 జులై వరకు అందుకు అవకాశం ఇవ్వాలని అభ్యర్థించాడు.
ముకేశ్ తరపున సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన న్యాయవాది ఎంఎల్ శర్మ.. కేంద్రం, దిల్లీ ప్రభుత్వం, కేసులో అమికస్ క్యూరీగా వ్యవహరించిన వినోద్ గ్రోవర్ కుట్ర చేశారని పేర్కొన్నారు. ఈ అంశంపై సీబీఐ విచారణ జరిపించాలని పిటిషన్‌లో అభ్యర్థించారు. సెషన్స్ కోర్టు ఆదేశించిందని భయపడి ముకేశ్‌ను వేర్వేరు పత్రాలపై సంతకం చేసేలా బలవంతపెట్టారని వివరించారు. సెషన్స్ కోర్టు అలా ఆదేశించలేదని ముకేశ్ ఇటీవలే తెలుసుకున్నాడని తెలిపారు.
అయితే... ముకేశ్ వ్యాజ్యంపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.
ముమ్మర ఏర్పాట్లు
నిర్భయ దోషుల్ని ఈనెల 20న ఉదయం 5.30 గంటలకు ఉరి తీసేందుకు దిల్లీ తిహార్ జైలు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. తలారి పవన్ మంగళవారం తిహార్‌కు చేరుకోనున్నాడు. ఉరి శిక్ష అమలుకు ట్రయల్స్ నిర్వహించనున్నాడు.