భాజపా యేతర సీఎంలతో బుధవారం జరిగిన సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా, టీఎంసీ అధినేత్రి మమత తమ మధ్య ఉన్న విభేధాలను పక్కన పెట్టినట్లే కనిపిస్తోంది. సమావేశ ఆరంభంలో మమత.. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ సేవలను గుర్తు చేసుకున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత భాజపాయేతర ప్రధానుల సేవలను మోదీ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశ ఆరంభానికి ముందు కార్యకలాపాలను ప్రారంభించాల్సిందిగా సోనియా గాంధీకి మమతా బెనర్జీ సూచించారు. వెంటనే సోనియా.. ఆ బాధ్యతలను చేపట్టాల్సిందిగా మమతనే తిరిగి కోరారు. ‘‘మీరిక్కడ ఉండగా నేనెలా నాయకత్వం వహిస్తాను’’ అంటూ ఆ విజ్ఞప్తిని మమతా బెనర్జీ సున్నితంగా తిరస్కరించారు. సమాఖ్య స్ఫూర్తి పేరుతో కేంద్రం.. రాష్ట్రాల హక్కులను కాలరాస్తోందని మమత పేర్కొన్నప్పుడు.. సోనియా గాంధీ ఆమె అభిప్రాయంతో పూర్తిగా ఏకీభవించారు. ఈ సమావేశంతో.. సోనియా విషయంలో మమత వైఖరి మారినట్లు కనిపిస్తోంది. గతంలో ఆర్టికల్ 370 రద్దు విషయంలో సమైక్యంగా పోరాడదామంటూ ప్రతిపక్షాలతో సోనియా సమావేశం ఏర్పాటు చేసినపుడు మమత హాజరుకాలేదు. పైగా కాంగ్రెస్ ద్వంద్వ ప్రమాణాల పాటిస్తోందంటూ ఆమె తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
భయపడదామా.. పోరాడదామా..
మోదీ ప్రభుత్వంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే కూడా తీవ్రస్థాయిలోనే విరుచుకుపడ్డారు. కేంద్రాన్ని చూసి భయపడాలో.. పోరాడాలో తేల్చుకోవాల్సిన తరుణం ఆసన్నమైందన్నారు. ‘‘మోదీ ప్రభుత్వానికి మనం భయపడొద్దు. కలిసి పోరాడదాం. కేంద్రంలో భాజపాను ఎన్నుకున్న ప్రజలే మనల్నీ ఎన్నుకున్నారు. మనం చేస్తే పాపం.. వారు చేస్తే పవిత్రమా. ఇది సరైన పద్ధతి కాదు’’ అని సమావేశంలో ఠాక్రే అన్నారు. మహారాష్ట్రలో కాంగ్రెస్, శివసేన మధ్య దూరం పెరుగుతుందన్న వార్తల నేపథ్యంలో ఠాక్రే వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఇదీ చదవండి: లైవ్ వీడియో: పేలిన సిలిండర్- త్రుటిలో..!