దేశంలో టపాసుల పరిశ్రమలకు పెట్టింది పేరైన శివకాశీలో పర్యావరణ హితమైన టపాసులను పెద్ద ఎత్తున తయారు చేస్తున్నారు. సంప్రదాయ టపాసులు హానికరమైన కాలుష్య కారకాలు విడుదల చేస్తున్నందున వాటిపై సుప్రీంకోర్టు నిషేధం విధించినందున హరిత టపాసుల వైపు తయారీదారులు అడుగులు వేశారు.
గతేడాది సుప్రీం నిర్ణయం తర్వాత 6 వేల కోట్ల టర్నోవర్ కలిగిన దాదాపు వెయ్యి పరిశ్రమలపై ప్రభావం పడింది. కోలుకోలేని స్థితిలోకి వెళ్లిన ఈ పరిశ్రమలు.. విస్తృత ప్రయోగాల తర్వాత హరిత టపాసుల తయారీతో మళ్లీ నిలదొక్కుకోగలిగాయి.
హరిత టపాసుల తయారీకి ఉత్తమ మార్గం
సంప్రదాయ బాణసంచా తయారీతో పోలిస్తే హరిత టపాసుల తయారీ కాస్త భిన్నమైనది. రసాయనాలు తక్కువ స్థాయిలో వినియోగించి పర్యావరణానికి అనుకూలమైన వాటిని తయారు చేయాల్సి ఉంటుంది. నాగ్‌పుర్‌లో ఉండే కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రిసెర్చ్, నేషనల్ ఎన్విరాన్మెంట్ ఇంజినీరింగ్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్లు కలిసి వివిధ ప్రయోగాలు నిర్వహించాయి. హరిత టపాసుల తయారీకి ఉత్తమమైన మార్గాన్ని కనుగొన్నాయి. బోరియం నైట్రేట్‌ను 20 శాతం వరకు శుద్ధి చేసి ఉపయోగిస్తే... టపాసులు పర్యావరణానికి తక్కువ హాని కలిగిస్తాయని ఆ సంస్థలు గుర్తించాయి. వీటి వాడకం, తయారీపై కార్మికులు, తయారీదారులకు విడతలవారీగా శిక్షణ ఇచ్చారు ఆయా సంస్థల అధికారులు.
'సంప్రదాయ టపాసులపై సుప్రీంకోర్టు 2018లో నిషేధం విధించినందున నాలుగు నెలల ముందు నుంచే టపాసులను తయారు చేస్తున్నాం. సుప్రీం నిషేధం నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హరిత టపాసులను తయారుచేయడానికి అవసరమైన నైపుణ్యాలను కార్మికులకు అందిస్తున్నాయి. సాధారణ టపాసులతో పోలిస్తే హరిత టపాసులు 30 శాతం తక్కువ ఉద్గారాలను విడుదల చేస్తాయి. శబ్ద కాలుష్యం 160 డెసిబుల్స్ నుంచి 125 డెసిబుల్స్ వరకు తగ్గుతుంది. సాధారణ స్థాయి అయిన 90 డెసిబుల్స్ వరకు శబ్ద కాలుష్యాన్ని తగ్గించడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.'
-పి. గణేశన్, తమిళనాడు టపాసుల తయారీదారుల సంఘం అధ్యక్షుడు