కరోనా ప్రభావం దేశ అత్యున్నత న్యాయస్థానంపైనా పడింది. దేశంలో వైరస్ బాధితుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా విచారణలను అత్యవర కేసులకు పరిమితం చేయాలని నిర్ణయించింది సుప్రీం కోర్టు. ఈనెల 16 నుంచి అత్యవసర కేసుల విచారణ మాత్రమే చేపడతామని స్పష్టం చేసింది. విచారణ సమయంలో కోర్టు గదుల్లోకి సంబంధిత న్యాయవాదులు మినహా మరెవరికీ అనుమతి ఉండదని పేర్కొంది.
గతనెల ఫిబ్రవరిలో సుప్రీం కోర్టుకు చెందిన ఆరుగురు న్యాయమూర్తులకు స్వైన్ ఫ్లూ సోకింది. ఫ్లూ విస్తరించకుండా నివారణ చర్యలు చేపట్టింది న్యాయస్థానం. కరోనా వేగంగా వ్యాపిస్తున్న సందర్భంగా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది.
ఇదీ చూడండి: ఆరుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు స్వైన్ ఫ్లూ
కోవిడ్-19ను ప్రపంచ ప్రమాదకర వ్యాధిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించిన నేపథ్యంలో పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడకూడదని కేంద్ర ప్రభుత్వం ఈనెల 5న మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ అంశంపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే అధ్యక్షతన ఆయన నివాసంలో నేడు సమావేశమయ్యారు న్యాయమూర్తులు. ముందుజాగ్రత్తలపై కీలక నిర్ణయం తీసుకున్నారు.
"కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను సమీక్షించి, ఆరోగ్య నిపుణుల సలహాలను పరిగణనలోకి తీసుకొని.. కోర్టుకు వచ్చే సందర్శకులు, కక్షిదారులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, భద్రత సిబ్బంది రక్షణ, సంక్షేమం దృష్ట్యా సుప్రీం విచారణలను అత్యవసర కేసులకే పరిమితం చేయాలని నిర్ణయించాం. దానికి అనుగుణంగానే ఆయా ధర్మాసనాలు పని చేస్తాయి. "
- సుప్రీం కోర్టు.
వచ్చే శుక్రవారం మరోమారు భేటీ..
పౌరుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని తీసుకున్న చర్యల అమలకు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరింది సుప్రీం కోర్టు. కరోనా అంశంపై వచ్చే శుక్రవారం మరోమారు సమావేశమై చర్చించనున్నట్లు తెలిపింది.
సమావేశానికి హాజరైన వారిలో న్యాయమూర్తులు జస్టిస్ అరుణ్ మిశ్ర, జస్టిస్ యూయూ లలిత్, అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్ కార్యదర్శి అరోరా, కేంద్ర ఆరోగ్య, న్యాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: మోదీ ప్రతిపాదనకు సార్క్ దేశాల విశేష స్పందన