కర్ణాటకలో భారీ వర్షాలకు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాల మధ్య సంబంధాలు తెగిపోయాయి. దేవనగరి జిల్లా హరిహర తాలుకలోని రాజనహల్లిలో తుంగభద్ర నదీ మధ్యలోని చెట్లపై చిక్కుకుపోయిన వానరాలను అటవీ శాఖ, అగ్నిమాపక సిబ్బంది.. తాళ్ల వంతెన నిర్మించి రక్షించారు. మూడు రోజుల పాటు తీవ్రంగా శ్రమించి.. 55 కోతులను కాపాడారు.
ఇదీ జరిగింది..
జిల్లాలోని మల్నాడు ప్రాంతంలో భారీగా కురుస్తోన్న వర్షాలకు తుంగ డ్యాం గేట్లు ఎత్తి కిందకు నీటిని వదిలారు అధికారులు. దీంతో తుంగభద్ర నది ఉప్పొంగింది. ఈ క్రమంలో రాజనహళ్లి ప్రాంతంలో ఆహారం కోసం వెళ్లిన కోతులు.. నది మధ్యలోని చెట్లపై చిక్కుకుపోయాయి.
సమాచారం అందుకున్న అటవీ శాఖ, పోలీసు, అగ్నిమాపక సిబ్బంది మూడు రోజుల క్రితం కోతులను కాపాడేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. బోట్ల ద్వారా వాటిని తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. కానీ, నదిలో నీటిమట్టం పెరుగుతుంటం వల్ల కోతులన్నీ ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టుపైకి వెళ్లటం వల్ల వారి ప్రయత్నాలు విఫలమయ్యాయి. దాంతో ముందుగా.. వాటన్నింటిని ఒకే చెట్టుపైకి చేరేలా చేశారు సిబ్బంది.
వానరాలు ఉన్న చెట్టు నుంచి గట్టుపైకి తాళ్ల వంతెన నిర్మించారు. దాని పైనుంచి ఒక్కో వానరం.. ఒడ్డుకు చేరుకుంది.
ఇదీ చూడండి: ఐదు రోజులుగా కృష్ణా నది మధ్యలో గొర్రెల మంద, కాపరి