చారిత్రక అయోధ్య నగరంలో రామమందిర నిర్మాణాన్ని పురస్కరించుకుని ఓ కీలక ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. మందిర నిర్మాణానికి శంకుస్థాపన జరిగిన తర్వాత తొలిసారిగా 'రామ్లీలా(రామాయణ ఘట్టం)' కార్యక్రమాన్ని ప్రదర్శించనున్నారు. పవిత్ర సరయూ నదీ తీరాన రామ మందిర ప్రాంగణానికి సుమారు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్మణ్ ఖిలా ఇందుకు వేదిక కాబోతోంది. అక్టోబరు 17 నుంచి 25 వరకూ జరిగే ఈ ప్రదర్శనల్లో దేశవ్యాప్తంగా హేమాహేమీలైన నటులు ముఖ్య పాత్రలు పోషించనున్నారు. రామాయణ ఔన్నత్యాన్ని కళ్లకు కట్టేలా.. శౌర్యం, విశ్వాసం, హిందూ సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ ఈ కార్యక్రమం కొనసాగనుంది.
ప్రముఖ బల్లితెర నటులు సోనూ దగర్ శ్రీరాముడిగా, కవితా జోషి సీతమ్మ తల్లిగా, విందూ దారా సింగ్ హనుమంతుడిగా, షాబాజ్ ఖాన్ రావణుడిగా అభినయించనున్నారు. భాజపా ఎంపీలు, నటులు, రవికిషన్, మనోజ్ తివారీ.. భరతుడు,అంగదుడు పాత్రలు పోషించనున్నారు. రామజన్మభూమి అయోధ్యలో రామబంటు హనుమంతుడి పాత్రను పోషించే అద్భుత అవకాశం రావడం ఆనందంగా ఉందని విందూ దారా సింగ్ పేర్కొన్నారు. రావణుడి పాత్రను ఓ నటుడి కోణంలోనే చూస్తాను తప్ప మత కోణంలో చూడనని షాబాజ్ ఖాన్ తెలిపారు. ఇలాంటి పాత్రను ఏ నటుడైనా అంగీకరిస్తారని పేర్కొన్నారు. దిల్లీకి చెందిన 'మేరీ మా' సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ ప్రదర్శనకు కరోనా పరిస్థితుల వల్ల ప్రేక్షకులను అనుమతించడం లేదు. అయితే టీవీ, యూట్యూబ్, సామాజిక మాధ్యమాల్లో 9 రోజుల పాటు ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.
ఇదీ చూడండి: సైన్యం కళ్లు కప్పి.. బంకర్లలో దాగి!