ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన నిర్వహించిన నీతి ఆయోగ్ 5వ పాలకమండలి సమావేశం ముగిసింది. వ్యవసాయ రంగంలో సమస్యలు-నిర్మాణాత్మక మార్పులు, దేశంలో నెలకొన్న కరవు పరిస్థితులు లక్ష్యాలుగా ఈ సమావేశం జరిగింది. వర్షపు నీటి పరిరక్షణ, వెనకబడిన జిల్లాల అభివృద్ధి అంశాలపైనా చర్చ జరిగింది.
వ్యవసాయ రంగంలో నిర్మాణాత్మక సంస్కరణలు చేపట్టడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్ణయం తీసుకున్నట్టు నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్ వెల్లడించారు.
"కరవు పరిస్థితి, సహాయక చర్యలపై చర్చలు జరిగాయి. విపత్తు నిర్వహక నిబంధనలను సమీక్షించాల్సిన అవసరం ఇప్పుడు ఏర్పడింది. దానిని పరిశీలిస్తాం. వ్యవసాయ రంగంలో నిర్మాణాత్మక సంస్కరణలు తీసుకురావడానికి ఉన్నత స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీని ప్రధాని నియమించారు. కొన్ని నెలల్లోనే ఈ కమిటీ కార్యరూపం దాల్చుతుంది. ఆ తరువాత 2-3 నెలలకు నివేదిక అందిస్తుంది."
- రాజీవ్ కుమార్, నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు.
ఈ సమావేశానికి బంగాల్, తెలంగాణ ముఖ్యమంత్రులు గైర్హాజరయ్యారు. అనారోగ్య కారణాలతో పంజాబ్ సీఎం రాలేదు. ఆయన స్థానంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి మన్‌ప్రీత్ బాదల్ హాజరయ్యారు.