తమిళనాడు తూత్తుకుడిలోని సతంకుళం ప్రాంతంలో మరో అమానుషమైన ఘటన జరిగింది. టీవీ చూసే విషయంలో ప్రారంభమైన గొడవ ఓ బాలిక ప్రాణాలు తీసింది. ఇంటికి వచ్చిన బాలికను కోపంతో యువకుడు గొంతునులిమేయడం వల్ల బాలిక ప్రాణాలు కోల్పోయింది.
ఈ ఘటనకు పాల్పడిన నిందితులు ముతీశ్వరర్(19), అతని స్నేహితుడు నందీశ్వరన్(19)లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
![Quarrel over watching TV claims life of 7 year old girl.](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tn-tut-03-sathankulam-child-murder-vis-photo-script-7204870_15072020182057_1507f_1594817457_250_1507newsroom_1594823004_872.jpg)
ఇదీ జరిగింది..
టీవీ చూడటానికి బుధవారం ఉదయం పొరుగునే ఉండే ముతీశ్వరర్ ఇంటికి వెళ్లింది బాలిక. అప్పటికే తన తండ్రితో గొడవపడ్డ ముతీశ్వరర్ కోపంతో టీవీ చూసేందుకు వచ్చిన బాలికపై అరిచాడు. దీంతో బాలిక ముతీశ్వరర్పై రాళ్లు విసరగా.. ఇరువురి మధ్య గొడవ తీవ్రమైంది.
"ముతీశ్వరర్ బాలిక గొంతునుమిలాడు. దీంతో బాలిక మూర్చపోయింది. భయపడిన ముతీశ్వరర్ కిందపడి ఉన్న బాలికను వాటర్ డ్రమ్‌లో వేయడం వల్ల ఆమె మరణించింది. బాలిక మృతదేహాన్ని బయటపారేయడానికి తన స్నేహితుడు నందీశ్వరన్ను పిలిచాడు. వాటర్ డ్రమ్‌ను ద్విచక్ర వాహనం ద్వారా తీసుకెళ్లి 1.5 కిలోమీటర్ల దూరంలోని అటవీ ప్రాంతంలో ఉన్న ఓ కల్వర్టులో మృతదేహాన్ని పారేశారు."
-పోలీసు అధికారి
ఇద్దరు బాలురు అనుమానస్పదంగా వ్యవహరించడం వల్ల మొత్తం ప్రాంతాన్ని స్థానికులు తనిఖీ చేశారని పోలీసులు తెలిపారు. అనంతరం ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం తరలించినట్లు వెల్లడించారు.
అత్యాచారం కాదు
ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్న విషయాన్ని తూత్తుకుడి ఎస్పీ ఎస్ జయకుమార్ ధ్రువీకరించారు. ప్రాథమిక విచారణలో బాలికపై అత్యాచారం జరిగిందనే ఆధారాలేవీ దొరకలేదని ఈటీవీ భారత్‌కు వెల్లడించారు. పోస్టుమార్టం నివేదిక అందిన తర్వాతే మరింత సమాచారం లభించే అవకాశం ఉందని చెప్పారు.
ఇదీ చదవండి- ఆయుధాల కొనుగోలులో సైన్యానికి అదనపు అధికారాలు!