భారతీయ జనతా పార్టీ నేతలు వరుసగా మృతి చెందుతుండటం వెనుక ప్రతిపక్ష పార్టీల కుట్ర ఉందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు కాషాయ పార్టీ ఎంపీ ప్రగ్యాసింగ్ ఠాకూర్.
కమలం నేతలకు హాని తలపెట్టేందుకు ప్రతిపక్షాలు క్షుద్రశక్తులు ఉపయోగిస్తున్నాయని ఆరోపించారామె. లోక్‌సభ ఎన్నికల సమయంలో తనకు ఓ యోగి ఈ విషయాన్ని చెప్పినట్లు ప్రగ్యా సింగ్ తెలిపారు. భాజపాకు గడ్డు సమయం రానుందని... కమలం పార్టీని దెబ్బ తీసేందుకు ప్రతిపక్షాలు తాంత్రిక శక్తుల్ని ఉపయోగిస్తాయని ఆ యోగి చెప్పినట్లు పేర్కొన్నారు ప్రగ్యా.
అయితే... ఆ విషయాన్ని అప్పుడే మరచిపోయానన్న ప్రగ్యాసింగ్.. పార్టీ నేతలు ఒక్కొక్కరూ మరణిస్తుంటే యోగి చెప్పిన విషయాలు అర్థమవుతున్నాయని వ్యాఖ్యానించారు. భోపాల్‌లో అరుణ్‌జైట్లీ, మధ్యప్రదేశ్ మాజీ సీఎం బాబులాల్ గౌర్ సంస్మరణ సభలో ప్రగ్యాసింగ్ ఈ సంచలన ఆరోపణలు చేశారు.
''మనకు చాలా కష్ట సమయం నడుస్తోంది. లోక్‌సభ ఎన్నికల సమయంలో ఓ యోగి నాకు ఒక విషయం చెప్పారు. ఇది మీకు చాలా గడ్డు కాలమని చెప్పారు. విపక్షాలు.. భారతీయ జనతా పార్టీ నేతలపై క్షుద్ర శక్తులు ప్రయోగిస్తాయని ఆ యోగి చెప్పారు. ఎన్నికల ప్రచారంలో పడి నేను ఆ విషయాన్ని మర్చిపోయాను. సుష్మాస్వరాజ్, బాబులాల్ గౌర్, జైట్లీ వంటి భాజపా సీనియర్ నేతలు వరుసగా మృతి చెందుతున్నారు. ఈ మరణాలు చూసినప్పుడు ఆ యోగి చెప్పింది నిజమే అని నాకు అనిపిస్తోంది.''
-ప్రగ్యాసింగ్ ఠాకూర్, భాజపా ఎంపీ