ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేస్తోన్న కరోనా వ్యాక్సిన్ మూడోదశ క్లినికల్ ట్రయల్స్.. దేశంలో వచ్చే వారం ప్రారంభం కానున్నాయి. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ).. పుణెలోని ససూన్ జనరల్ ఆస్పత్రిలో ట్రయల్స్ నిర్వహణ చేపట్టనుంది. ఈ విషయాన్ని ససూన్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ మురళీధరన్ తంబే తెలిపారు.
'కొవిషీల్డ్' వ్యాక్సిన్ మూడోదశ ట్రయల్స్.. సోమవారం నుంచి ప్రారంభమయ్యే అవకాశముందని మురళీధరన్ వెల్లడించారు. ఇందుకోసం ఇప్పటికే 150 నుంచి 200 మంది వాలంటీర్లు తమ పేర్లు నమోదు చేసుకున్నారని ఆయన పేర్కొన్నారు. స్వచ్ఛందంగా టీకా తీసుకోదలిచిన వారెవరైనా ముందుకు రావొచ్చన్నారు.
కరోనా వ్యాక్సిన్ అభివృద్ధిలో భాగంగా బ్రిటీష్- స్వీడిష్ ఫార్మా కంపెనీ ఆస్ట్రాజెనెకాతో భాగస్వామ్యమైన ఎస్ఐఐ.. పుణెలోని భారతీ విద్యాపీఠ్ మెడికల్ కలాశాల, కేఈఎం ఆస్పత్రులలో ఇటీవలే రెండో దశ ట్రయల్స్‌ను నిర్వహించింది.
ఇదీ చదవండి: ఆక్స్ఫర్డ్ టీకా ట్రయల్స్ పునఃప్రారంభానికి లైన్ క్లియర్