ఒక నాయకుడు పాలు, సైకిల్, గ్యాస్, పొయ్యి, దుప్పట్లు ఇవ్వమని మిమ్మల్ని అడుగుతుంటే విభిన్నంగా ఉంటుంది కదా. వాళ్లు సేకరించేది పార్టీ నిధుల కోసమైతే ఇంకా ఆశ్చర్యంగా ఉంటుంది. మన దేశంలో ఇలా జరగదు అనుకుంటున్నారా? దిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఇదే చేస్తోంది.
లోక్‌సభ బరిలో దిగిన ఆప్ సభ్యులు ప్రజల నుంచి విరాళాలు సేకరిస్తున్నారు. డబ్బులు మాత్రమే కాకుండా ప్రజలు ఏమిచ్చినా తీసుకుంటున్నారు.
ఎక్కడికి వెళ్లినా ప్రజలను... ఓటు మాత్రమే కాదు, చందా కూడా కావాలని అడుగుతాం. విరాళం ఏ రూపంలో ఇచ్చినా తీసుకుంటాం. రూ.2000 కంటే తక్కువ మొత్తం అయితే నగదు తీసుకుంటాం. ఇంతకంటే ఎక్కువైతే చెక్ స్వీకరిస్తాం. డబ్బులు మాత్రమే కాకుండా అన్ని రకాల వస్తువులు తీసుకుంటాం. పాత ఫోన్, సైకిల్, బైక్, మంచం, దుప్పటి... ఇలా ఏ వస్తువునైనా స్వీకరిస్తాం.
వాళ్లు ఇచ్చే రూ.100 రూపాయలు డబ్బులు మాత్రమే కాదు. వారి నమ్మకం.పార్టీ కార్యాలయంలో ఛాయ్ కావాలి. పాల వ్యాపారం ఉన్న స్నేహితుడు పాలు ఇస్తారు. ఇలా రోజూ పాలు ఆఫీసుకు వస్తాయి. ఒక స్నేహితుడికి బిస్కెట్ వ్యాపారం ఉందనుకోండి. డబ్బులు లేనప్పుడు బిస్కెట్లు అందిస్తారు. పాలు, బిస్కెట్లు, టీపొడి ఈ విధంగానే సమకూరుతాయి. ఇలా చేసిన ఛాయ్‌ను ప్రజలు తాగొచ్చు. ప్రజల సరుకులు, ప్రజల ద్వారా, ప్రజలకే అందిస్తున్నాం.
- దిలీప్ పాండే, ఈశాన్య దిల్లీ ఆప్ అభ్యర్థి
తూర్పు దిల్లీ నుంచి పోటీ చేస్తున్న అతిశీ ఇదే పద్ధతిలో విరాళాలు సేకరించారు. ఇప్పటివరకు మొత్తం రూ.40 లక్షల రూపాయలు పోగుచేశారు. కళాశాల పూర్వ విద్యార్థుల నుంచీ నిధులు కోరుతున్నారు. దక్షిణ దిల్లీ నుంచి పోటీ చేస్తున్న రాఘవ్ చద్దా తాను చదివిన పాఠశాల పూర్వ విద్యార్థుల నుంచి సహాయం పొందనున్నారు.