నిర్భయ కేసు దోషికి మరణశిక్ష విధించడంపై పునఃసమీక్ష కోరుతూ దాఖలైన పిటిషన్పై విచారణను వాయిదా చేసింది సుప్రీం కోర్టు. ఈ కేసును విచారించే ధర్మాసనం నుంచి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే స్వయంగా తప్పుకోవడమే ఇందుకు కారణం. వ్యక్తిగత కారణాలతోనే బెంచ్ నుంచి తప్పుకున్నట్లు స్పష్టంచేశారు జస్టిస్ బోబ్డే. బుధవారం ఉదయం 10. 30 గంటలకు వేరొక విస్తృత ధర్మాసనం.. దోషి పిటిషన్పై విచారణ జరుపుతుందని స్పష్టం చేశారు.
తమ బంధువుల్లో ఒకరు గతంలో బాధితురాలి తల్లి తరఫున వాదించారని... అందుకే వేరొక ధర్మాసనం విచారణ జరపడమే సముచితమని అభిప్రాయపడ్డారు జస్టిస్ బోబ్డే.
దోషికి అన్యాయం!
కేసులో అక్షయ్ తరఫున వాదిస్తోన్న న్యాయవాది ఏపీ సింగ్.. ఈ కేసు రాజకీయ, మీడియా ఒత్తిళ్లకు గురైందని సుప్రీంకు తెలిపారు. దోషికి తీవ్ర అన్యాయం జరిగిందని పేర్కొన్నారు.
2012 డిసెంబరు 16వ తేదీ రాత్రి 23 ఏళ్ల పారామెడికల్ విద్యార్థినిపై దిల్లీలో ఆరుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వీరిలో ఒకడు మైనర్ కాగా.... మరొకడు తిహార్ జైలులో ఆత్మహత్య చేసుకున్నారు. మిగిలిన దోషులైన ముకేశ్, పవన్ గుప్తా, వినయ్ శర్మల రివ్యూ పిటిషన్లను గతేడాది జులై 9నే కోర్టు కొట్టివేసింది. మరో దోషి అక్షయ్ కుమార్ సింగ్.. మరణశిక్షపై పునఃసమీక్షించాలంటూ తాజాగా సుప్రీంను ఆశ్రయించాడు.