కొవిడ్ నేపథ్యంలో ప్రజారవాణా వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం పెంచాలని, అలాగే మోటారేతర (నాన్-మోటారైజ్డ్) రవాణా సాధనాలను ప్రోత్సహించాలని రాష్ట్రాలకు సూచించింది కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ. పట్టణ ప్రాంతాల్లో దగ్గరి దూరాలకు విద్యుత్తు వాహనాలు, సైకిళ్లు, కాలినడకన రాకపోకలు సాగించేలా ప్రోత్సహించాలని పేర్కొంది.
కొవిడ్ భయంతో ఎక్కువ మంది ప్రజలు ప్రైవేటు వాహనాలవైపు మళ్లే అవకాశం ఉందని.. దీంతో ట్రాఫిక్, కాలుష్యం పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది. భౌతికదూరం పాటిస్తూ ప్రజారవాణా వ్యవస్థను నడపాల్సి ఉన్నందున ఇదివరకటి ప్రయాణికుల సంఖ్యలో 25 నుంచి 50 శాతానికి మించి సేవలందించే అవకాశం ఉండకపోవచ్చని.. ఫలితంగా డిమాండ్, సరఫరా మధ్య అంతరం పెరిగే అవకాశం ఉంటుందని పేర్కొంది.
ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టు చాలా దేశాలు సైకిళ్ల రాకపోకలు పెంచడానికి చర్యలు తీసుకున్నాయని.. వాటిని ఆదర్శంగా తీసుకొని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు చర్యలు చేపట్టాలని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ కార్యదర్శి దుర్గాశంకర్ మిశ్ర శుక్రవారం రాష్ట్రాలకు జారీచేసిన అడ్వయిజరీలో పేర్కొన్నారు. మెట్రో రైలు కంపెనీలు స్వల్ప (6 నెలలు), మధ్య (ఏడాది), దీర్ఘకాలిక (1-3 ఏళ్లు) వ్యూహంతో మూడంచెల విధానాన్ని అనుసరించాలని సూచించారు.
ప్రైవేటు వాహనాల తాకిడి..
కేంద్ర పట్టణాభివృద్దిశాఖ ఇప్పటికే రవాణా నిపుణులు, పారిశ్రామిక వర్గాలు, రవాణావ్యవస్థల నిర్వాహకులు, ప్రపంచబ్యాంకు ప్రతినిధులు, ఇతర ప్రముఖులతో పలు దఫాలు చర్చలు జరిపింది. కొవిడ్-19 నేపథ్యంలో ప్రజారవాణా వ్యవస్థలో ప్రయాణించడం ప్రమాదకరమన్న భావన ప్రజల్లో ఉన్నందున రహదారులపై ప్రైవేటు వాహనాలు పెరిగే అవకాశం ఉందన్న అంచనాకు వచ్చింది. ఈ నేపథ్యంలో పలు సూచనలు చేసింది.
- పర్యావరణ హిత, కాలుష్య రహిత, సౌకర్యవంతమైన, సుస్థిర రవాణా వ్యవస్థలను ఎంచుకోవాలి.
- ప్రజారవాణా వ్యవస్థలో నగదు లావాదేవీలు లేకుండా ఈ-టిక్కెటింగ్, డిజిటల్ చెల్లింపులు వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలి. దీనివల్ల పరస్పరం తాకే అవసరం రాదు.
- దుకాణాలు నెలకొల్పిన ప్రాంతాలను క్రమంగా పాదచారుల కోసం కేటాయించి రహదారుల్లో రద్దీని తగ్గించాలి.. నగరాల్లో కాలినడకన రాకపోకలు సాగించేందుకు వీలు కల్పించాలి.
- సంప్రదాయ సైకిళ్లు, రిక్షాలు వంటి మోటారు రహిత రవాణా విధానాన్ని అమలు చేయడానికి ఇదే సరైన సమయం.
- అల్పాదాయ, మధ్యతరగతి వర్గాలు ఎక్కువగా ఆధారపడే ప్రజారవాణా సాధనాల్లో పరిశుభ్రత, భౌతికదూరం, వైరస్ వ్యాప్తిని నిరోధించే ఇతర పద్ధతులను పాటించాలి.
- వివిధ దేశాలు చేపట్టిన చర్యలను నమూనాగా తీసుకోవాలి.