దేశవ్యాప్తంగా జరుగుతున్న టీకా పంపిణీపై అపోహలు సృష్టించే తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దన్నారు కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్.
ఒక్కసారి తెరచిన డోసులను ఉపయోగించకపోతే వృథా అవుతాయని కాంగ్రెస్ నేత పి.చిదంబరం చేసిన ట్వీట్‌పై స్పందించిన మంత్రి.. ఏ ఒక్క డోసూ వృథా కాదని స్పష్టం చేశారు. వదంతులు వ్యాప్తి చేయవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ అంశంపై వీరిద్దరి మధ్య ఆసక్తికర చర్చ జరిగింది.
టీకాల పట్ల చిదంబరం గారి బాధ్యతాయుత ఆందోళనను అభినందిస్తున్నా. ఈ సమస్యను పరిష్కరించడానికి కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ చర్యలు చేపట్టింది. ఏ ఒక్క డోసూ వృథా కాకుండా చూసుకుంటున్నాం.
హర్షవర్ధన్,కేంద్ర ఆరోగ్య మంత్రి
భారత్ బయోటెక్ తయారుచేసిన కొవాగ్జిన్ టీకా సమర్థతపై చిదంబరం ప్రశ్నకు బదులిస్తూ.. నిర్మాణాత్మకమైన ఆలోచనలపై దృష్టిసారించాలని హితవు పలికారు.
అసోంలో 1000 డోసులు వృథా..??
అసోంలోని సిల్చార్ వైద్య ఆసుపత్రి కళాశాలలో కరోనా టీకాను భద్రపరచడంలో నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణలొచ్చాయి. అయితే ఈ ఘటనతో టీకాల పంపిణీకి ఎటువంటి ఆటంకం కలగదని.. జిల్లాలో సరిపడినన్ని నిల్వలున్నాయని కాచర్ డిప్యూటీ కమిషనర్ కీర్తి జల్లి తెలిపారు. సరైన నిల్వ, కోల్డ్ స్టోర్ సౌకర్యాలు లేక కేవలం వంద కొవిషీల్డ్ డోసులు వృథా అయ్యాయని ఆమె చెప్పారు. ఈ ఘటన వెనుక ఉన్న కచ్చితమైన కారణాన్ని తెలుసుకోవడానికి విచారణకు ఆదేశించినట్టు తెలిపారు.
-8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయాల్సిన డోసులను సున్నా ఉష్ణోగ్రతకు పరిమితం చేశారని.. ఫలితంగా అవి పాడైపోయాయని నేషనల్ హెల్త్ మిషన్ డైరెక్టర్ (అసోం) డాక్టర్ ఎస్ లక్ష్మణన్ తెలిపారు. టీకా నిల్వ, సరఫరా బాధ్యతలు చూస్తోన్న అధికారులకు షో-కాజ్ నోటీసులు జారీ చేశామన్నారు.
సాధారణంగా టీకాలు నిల్వ చేసే 'ఐస్ లైన్డ్' రిఫ్రిజిరేటర్లలో ఉష్ణోగ్రత పెరిగినా, తగ్గినా హెచ్చరిక సందేశం వస్తుంది. అయితే మెసేజింగ్ వ్యవస్థలో లోపం కారణంగా సందేశమేమీ రాలేదని ఆయన తెలిపారు. కాచర్ జిల్లాలో మొదటి దశలో 11,710 మంది ఆరోగ్య కార్యకర్తలకు టీకాలు వేయాల్సి ఉంది.
ఇదీ చదవండి: ఐదు రోజుల్లో 7లక్షల మందికి కరోనా టీకా