ధర్మేంద్ర ప్రతాప్ సింగ్... ఉత్తర్‌ప్రదేశ్ ప్రతాప్‌గఢ్ వాసి. వయస్సు 43. ఎత్తు 8 అడుగుల ఒక అంగుళం. దేశంలోనే అత్యంత ఎత్తయిన వ్యక్తిగా గుర్తింపు పొందారాయన.
ధర్మేంద్రకు ఇటీవలే ఓ శస్త్రచికిత్స జరిగింది. గుజరాత్ అహ్మదాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రి... ఆయనకు తుంటి మార్పిడి ఆపరేషన్‌ను ఆగస్టు 26న విజయవంతంగా చేసింది. ఆయన ఇప్పటికి దాదాపు పూర్తిగా కోలుకున్నారు.
కొంతకాలం క్రితం జరిగిన ఓ ప్రమాదంలో ధర్మేంద్ర తుంటి దెబ్బతింది. తర్వాత ఆయన తీవ్రమైన నడుము నొప్పితో బాధపడ్డారు. చికిత్స చేయలేమని లఖ్‌నవూలోని వైద్యులు చేతులెత్తేశారు. ఫలితంగా ధర్మేంద్ర అహ్మదాబాద్ చేరుకున్నారు. ఆయన ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఉచితంగా వైద్యం చేసింది కేడీ ఆస్పత్రి.
తుంటి మార్పిడి శస్త్రచికిత్సలో నడుము భాగంలో అసెటేబులార్ కప్పులు అమర్చాల్సి ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్నవి... ధర్మేంద్రకు సరిపోలేదు. అందుకే చెన్నై నుంచి ప్రత్యేకంగా తెప్పించారు వైద్యులు.
"శస్త్రచికిత్స చేయటానికి 2-3 గంటలు పట్టింది. నడుము భాగంలోని కప్పు సైజ్ పెద్దగా ఉండటం వల్ల అత్యంత జాగ్రత్తగా ఈ శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది. తుంటి మార్పిడి సాధారణ వ్యక్తికి జరిగితే సాయంత్రానికల్లా వారు నడవగలరు. కానీ ధర్మేంద్ర నడవటానికి 3 వారాలు పట్టింది."
-డాక్టర్ అతీత్ శర్మ, వైద్యుడు.
ఇదీ చూడండి : నగరంపై తేనెటీగలు దండెత్తితే ఇలానే ఉంటుంది...