Menopause Health Problems in Woman : వయసులో ఉన్నప్పుడు అనారోగ్యాలు పెద్దగా బాధించవు. కానీ.. ఒక వయసు దాటిన తర్వాత చాలా మందిలో పలు రకాల ఆరోగ్య సమస్యలు మొదలవుతాయి. ముఖ్యంగా మహిళల్లో చాలా ఇబ్బందులు కనిపిస్తాయి. ఇలాంటి సమస్యల్లో ఒకటి ఒంట్లో నుంచి వేడి ఆవిర్లు రావడం. దీనితోపాటు విపరీతమైన చెమటలు వస్తుంటాయి. ఇంకా అరికాళ్లలో మంటలు వేధిస్తుంటాయి. ఈ సమస్య వచ్చినవారు తమకు ఎందుకు ఇలా అవుతోందో తెలియక హైరానా పడిపోతుంటారు. మరి.. ఈ సమస్యకు కారణం ఏంటి? వైద్య నిపుణులు ఏం చెబుతున్నారు? అన్నది ఇప్పుడు చూద్దాం.
మహిళల్లో మెనోపాజ్ అనేది ఒక దశ. గతంలో 50 నుంచి 55 ఏళ్లు దాటిన వారిలోనే మెనోపాజ్ కనిపిచేంది. కానీ.. జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మందిలో 40 ఏళ్లలోనే వస్తోంది. ఈ దశలో రుతుక్రమం ఆగిపోతుంది. ఫలితంగా పలురకాల ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. అలాంటి వాటిల్లో ఒకటే.. ఒంట్లో వేడి ఆవిర్లు, అరికాళ్లలో మంటలు రావడం. ఈ సమస్యలు కొందరి మామూలుగా ఉంటే.. మరికొందరిలో చాలా తీవ్రంగా ఉంటాయి. ఈ ఇబ్బందులు కామన్‌గా వస్తుంటాయని నిపుణులు చెబుతున్నారు. అయితే.. అదనపు ఆరోగ్య సమస్యలు ఉన్నవారిలో మరింత ఎక్కువగా కనిపిస్తుంటాయని చెబుతున్నారు.
ఆ సమస్యలు ఉంటే..
చాలా మందిలో విటమిన్ లోపాలు ఉంటాయి. వాటికి తోడు ఇతర అనారోగ్యాలు, దీర్ఘకాలిక రోగాలు ఉంటాయి. ఇవి ఉన్నవారిలో ఈ వేడి ఆవిర్లు, చెమట సమస్య తీవ్రంగా ఉంటుంది. ఇలాంటి వారు తప్పనిసరిగా ఏడాదికి ఒకసారి పరీక్షలు చేయించుకోవాలని గైనకాలజిస్ట్ సవితాదేవి సూచిస్తున్నారు. ఎలాంటి విటమిన్ లోపాలు ఉన్నాయో తెలుసుకొని వాటికి సంబంధించిన మందులు వాడాలని, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని సూచిస్తున్నారు. వైద్యుల సూచనల మేరకు క్యాల్షియం, విటమిన్ సప్లిమెంట్లు తీసుకుంటూ ఉండాలని సూచిస్తున్నారు.
మెనోపాజ్ దశలో ఈ ఆహారం తీసుకోవాలి..
పండ్లు : ప్రకృతి అందించే అద్భుత ఔషధాలు పండ్లు. ఇవి మనకు ఎంతో ఆరోగ్యాన్ని అందిస్తాయి. అందుకే.. ఫైబర్, విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే పండ్లు, కూరగాయలను ఆహారంలో భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా పండ్లలో బెర్రీలు, సిట్రస్ ఫ్రూట్స్, వెజిటబుల్స్‌లో ఆకుకూరలు, బ్రోకలీ వంటివి తీసుకోవాలని సూచిస్తున్నారు.
ఆరోగ్యకరమైన కొవ్వులు: అవిసె గింజలు, నట్స్, చియా సీడ్స్, చేపలు వంటి వాటిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి. కాబట్టి.. తప్పకుండా మీ డైట్లో ఇవి ఉండేలా చూసుకోవాలి.
ప్రొటీన్: చికెన్, మేక మాంసం, గుడ్లు, బీన్స్, లెంటిల్స్ వంటి ప్రోటీన్ ఉన్న ఆహారాలు ఎముకల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి ఆహారంలో భాగం చేసుకోవాలి.
కాల్షియం: పాలు, పాల ఉత్పత్తులు తప్పకుండా తీసుకోవాలి. బాదం, పిస్తా వంటి డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకోవాలి. వీటిల్లో కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుంది. రోజూ ఉదయాన్నే కాసేపు ఎండలో నిల్చోవాలి.
జీవన శైలి మారాలి..
సమతుల ఆహారం తీసుకుంటూ చక్కటి జీవనశైలిని అలవర్చుకుంటే ఈ సమస్యను చాలావరకు అధిగమించవచ్చని సవితాదేవి చెబుతున్నారు. కంటి నిండా నిద్రపోవాలి. రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని సూచిస్తున్నారు. నడక చక్కటి వ్యాయామమని రోజులో కనీసం అరగంటపాటు నడవాలని అంటున్నారు. ఇవన్నీ పాటిస్తే.. తప్పకుండా సమస్యను తగ్గుతుందని సూచిస్తున్నారు.