మహారాష్ట్రలో మహిళ గొంతుతో మోసాలకు పాల్పడిన ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు. పాల్ఘర్ జిల్లాకు చెందిన మనీశ్ అంబేకర్(40).. ఆడ గొంతుతో మాట్లాడుతూ.. జనరల్ స్టోర్స్, మందుల దుకాణాలు, జ్యువెల్లరీ షాప్స్, హోల్‌సేల్ వర్తకులను మోసగించాడని పోలీసులు తెలిపారు. ఠానే, పాల్ఘర్, ముంబయి, నాసిక్, పుణెలలో అనేక మంది దుకాణదారులు మనీశ్ కపట స్వరానికి మోసపోయినట్లు వెల్లడించారు.
ఇలా చేస్తాడట..
తొలుత ఓ దుకాణాదారుణ్ని ఎంచుకుంటాడు మనీశ్. అనంతరం ఆ షాప్‌నకు ఫోన్ చేసి.. సమీపంలోని ఓ ఇంటి నుంచి మాట్లాడుతున్నట్లు మహిళ గొంతుతో మాట్లాడుతాడు. తన వద్ద రూ. 2000 నోటు ఉందంటూ.. షాప్‌లో కొన్ని వస్తువులను ఆర్డర్ చేస్తాడు. 2వేలకు మిగతా చిల్లర డబ్బులు పంపమని కోరతాడు. ఆ తర్వాత దుకాణం మెయిన్ గేటు వద్ద నిల్చుని.. 'మీకు ఇందాక ఫోన్ చేసిన వ్యక్తే నన్ను పంపిచారు' అని చెప్పి.. డెలివరీ బాయ్ వద్ద నుంచి ఆ వస్తువులను తీసుకుంటాడు. సరకులు ఇచ్చిన వ్యక్తి దుకాణానికి వెళ్లి, యజమానితో విషయం చెప్పేలోగా అక్కడి నుంచి జారుకుంటాడు మనీశ్.
ఇలాంటి తరహా మోసాలకు పాల్పడుతూ.. ఇటీవలే నాలసోపారలో అడ్డంగా దొరికిపోయాడు. ప్లాన్ ప్రకారం మనీశ్‌ను పట్టుకున్న పోలీసులు.. అతడిపై కేసు నమోదు చేశారు. దర్యాప్తులో నిందితుడి నుంచి రూ. 1.60 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చదవండి: కరోనా ఆంక్షల నడుమ.. మైసూర్లో 'దసరా' ఉత్సవాలు