కరోనా వైరస్‌ను ఎదుర్కోవడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమవుతోందని మక్కల్ నీది మయ్యం(ఎంఎన్ఎం) పార్టీ అధినేత కమల్ హాసన్ ఆరోపించారు. ఈ విషయంలో ప్రధాని మోదీ అమలు చేసిన లాక్డౌన్ నిర్ణయాన్ని విమర్శిస్తూ కేంద్రానికి బహిరంగ లేఖ రాశారీ ప్రముఖ సినీనటుడు. నోట్ల రద్దు తరహాలోనే లాక్డౌన్ కూడా ఘోరంగా విఫలమైందని ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
దేశవ్యాప్తంగా చేపట్టిన మూడువారాల లాక్‌డౌన్‌ను కేంద్ర ప్రభుత్వం సరిగా అమలు చేయలేదని లేఖలో పేర్కొన్న కమల్... దీనికి సాధారణ ప్రజలను నిందించడం సరికాదన్నారు. ప్రపంచ దేశాల్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారిని అరికట్టేందుకు... కేంద్ర ప్రభుత్వం సరైన ప్రణాళిక, ముందస్తు జాగ్రత్తలు చేపట్టలేదని ఆరోపించారు. నోట్ల రద్దు తరహాలోనే.. భారీ స్థాయిలో మరో తప్పిదం చోటు చేసుకుంటుందేమోనన్న భయం తనను వెంటాడుతోందని కమల్ తెలిపారు.
ముందే ఎందుకు అప్రమత్తం కాలేదు?
'కేవలం 4 గంటల వ్యవధిలో సుమారు 140 కోట్ల మంది ప్రజలను లాక్‌డౌన్‌కు సిద్ధం కావాలని పిలుపునిచ్చిన మీకు.. 4 నెలల ముందే వైరస్ సమాచారం ఉన్నా ఎందుకు అప్రమత్తమవ్వలేదని' మోదీని ఉద్దేశించి అన్నారు.
వారిని ఆదుకోండి
మహమ్మారి వైరస్‌తో అధికంగా ఇబ్బందులు ఎదుర్కొనే వెనుకబడిన వర్గాల ప్రజలను ఆదుకునే చర్యలు ప్రకటించాలని కోరారు ఎంఎన్ఎం అధినేత. అట్టడుగు వర్గాల ప్రజల సమస్యలను పట్టించుకోవాలన్న కమల్ హాసన్... పునాదులు దెబ్బతింటే అద్భుత కట్టడాలు కూడా కుప్పకూలుతాయన్నారు. ఏ ఒక్కరూ ఆహారం తీసుకోకుండా నిద్రించే పరిస్థితి ఎదురుకాకుండా జాగ్రత్త పడాలని సూచించారు.
ఇదీ చదవండి: లాక్డౌన్ స్కిల్స్: ఆన్లైన్లో ఇవి నేర్చుకుంటున్నారా?