విద్యార్థుల నిరవధిక ఆందోళనలతో దిల్లీ జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం కార్యనిర్వాహక మండలి దిగొచ్చింది. పెంచిన వసతి గృహాల రుసుములను పాక్షికంగా తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ఆర్థిక వెసులుబాటు కల్పించనున్నట్లు తెలిపింది.
హాస్టల్ ఫీజులను పాక్షికంగా తగ్గించినందున విద్యార్థులు ఆందోళనలు వీడి తరగతులకు హాజరుకావాలని విద్యాశాఖ కార్యదర్శి ట్వీట్ చేశారు.
భగ్గుమన్న విద్యార్థులు
ఇటీవల వసతి గృహాల ఫీజులు పెంచుతూ జేఎన్యూ కార్యనిర్వాహక మండలి నిర్ణయం తీసుకుంది. ఒక విద్యార్థి ఉండే హాస్టల్ గది అద్దెను రూ.20 నుంచి రూ.600కు, ఇద్దరు విద్యార్థులు ఉండే గదులకు రూ.10 నుంచి రూ.300లకు పెంచింది.
ఈ ప్రకటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థులు ఆందోళన చేపట్టారు. తరగతులను బహిష్కరించి 16 రోజులపాటు నిరసనలు, ధర్నాలు చేపట్టారు. రోజురోజుకూ విద్యార్థుల ఆందోళనలు ఉద్ధృతం అవుతున్న నేపథ్యంలో జేఎన్యూ నష్ట నివారణ చర్యలు చేపట్టింది. ఫలితంగా ఒక విద్యార్థి ఉండే హాస్టల్ గది అద్దె రూ.200, ఇద్దరు విద్యార్థులు ఉండే గది అద్దె రూ.100కు తగ్గింది.
కంటితుడుపు చర్య
జేఎన్యూ తాజా ప్రకటనను విద్యార్థులు, అధ్యాపకులు కంటితుడుపు చర్యగా అభివర్ణిస్తున్నారు. ఇది తమను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తున్నట్లుగా ఉందని అభిప్రాయపడుతున్నారు.
ఇదీ చూడండి: రామ మందిర నిర్మాణంతో మరో తిరుపతిగా అయోధ్య!