దేశంలో కరోనా వైరస్ మృతుల సంఖ్య 200లు దాటింది. నెల రోజుల వ్యవధిలో ఈ స్థాయిలో మరణాలు సంభవించడం ఆందోళన కలిగిస్తోంది. అయితే.. అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చితే భారత్లో మరణాల రేటు చాలా తక్కువగా ఉండటం ప్రజలకు ఉపశమనం కల్గించే వార్త.
దేశంలో మార్చి 10న తొలి కరోనా మరణం సంభవించింది. కేంద్ర ఆరోగ్యశాఖ తాజా గణాంకాల ప్రకారం 206మంది వైరస్ సోకి ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 6,761కి చేరింది. ఫలితంగా భారత్లో మరణాల రేటు 3.04గా ఉంది.
- ప్రపంచవ్యాప్తంగా 1,622,778 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 97,205 మందిని వైరస్ బలిగొంది. మరణాల రేటు 5.9శాతంగా ఉంది.
భారత్లో మరణాల రేటు తక్కువగా ఉండటానికి నిపుణులు చెబుతున్న కారణాలు..
- ఇతర దేశాలతో పోల్చితే భారత్లో యువత ఎక్కువ.
- లాక్డౌన్ను ముందు నుంచే కఠినంగా అమలు చేయడం.
- ఐరోపా, అమెరికాతో పోల్చితే వైరస్ బారిన పడుతున్న వృద్ధుల సంఖ్య చాలా తక్కువ.
- పాజిటివ్ కేసుల్లో 40ఏళ్లలోపు ఉన్నవారు 47శాతం, 40-60 ఏళ్ల వారు 34శాతం, 60ఏళ్లు పైబడిన వారు 19శాతం(ఆరోగ్యశాఖ గతవారం వెల్లడించిన గణాంకాలు).
- భారత్లో కరోనా ఉద్ధృతి తక్కువగా ఉండటం.
భారత మరణాల రేటు.. ప్రపంచం మరణాల రేటుతో పోల్చితే చాలా తక్కువగా ఉండటం అతిపెద్ద సానుకూల అంశం.
జర్మనీ ఒక్కటే...
గణాంకాల ప్రకారం జర్మనీ ఒక్కటే వైరస్ వ్యాప్తిని నియంత్రించినట్టు కనిపిస్తోంది. 1,13,525 కేసులు నమోదు కాగా.. 2,373 మంది మరణించారు. ఫలితంగా అక్కడ మరణాల రేటు 2.09గా ఉంది.
ఇదీ చూడండి:- ఆహారం, కిరాణా సామగ్రి ద్వారా కరోనా వ్యాపిస్తుందా?