పరుగులు పెట్టే విలాస విల్లాగా పేరొందిన 'ప్రైడ్ ఆఫ్ కర్ణాటక' గోల్డెన్ చారియట్ రైలు మళ్లీ కూత పెట్టనుంది. కరోనా కారణంగా చతికిలపడిన పర్యటక రంగానికి ఊతమిచ్చే చర్యల్లో భాగంగా.. ఈ స్వర్ణరథాన్ని ప్రారంభించనుంది రైల్వేశాఖ. దీన్ని 2021 జనవరి నుంచి అందుబాటులోకి తీసుకురానున్నట్లు అధికారులు తెలిపారు.
కర్ణాటక యశ్వంతపుర నుంచి ప్రారంభమయ్యే ఈ రైలులో ప్రయాణిస్తే.. కర్ణాటక సహా తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ప్రసిద్ధ పర్యటక ప్రదేశాలను చుట్టేయొచ్చు. ఈ రైలును ప్రదర్శన, నిర్వహణ కోసం 2020 జనవరిలో ఐఆర్సీటీసీకి చేతుల్లో పెట్టింది కర్ణాటక పర్యటక విభాగం.
యాత్ర ప్యాకేజీలు..
ఈ రైలులో ప్రయాణించేవారికి కొన్ని ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి.
- ఆరు రాత్రులు- ఏడు పగటిపూట ప్రయాణాలుండే ప్యాకేజీలో భాగంగా కర్ణాటకలోని బందీపురా నేషనల్ పార్కు, మైసూర్, చిక్ మగళూరు, ఐహోలు, పట్టడకల్, హంపీ, గోవా ప్రాంతాలను సందర్శించవచ్చు.
- 'జేమ్స్ ఆఫ్ సౌత్' ప్యాకేజీలో మైసూర్, హంపీ, తమిళనాడులోని మహాబలిపురం, చిట్టినాడ్, కొచ్చి, కుమరక్కం వంటి పర్యటక ప్రదేశాలను ఆరు సాయంత్రాలు- ఏడు పగళ్లు ప్రయాణించి వీక్షించవచ్చు.
- 'లుక్ ఎట్ కర్ణాటక', 'గ్లింప్సెస్ ఆఫ్ కర్ణాటక' ప్యాకేజీల్లో బందీపురా, మైసూర్, హంపీ ప్రాంతాలను తిరిగేయొచ్చు.
- 'జువెలరీ ఆఫ్ కర్ణాటక' ప్యాకేజీలో భాగంగా మైసూర్, హంపీ, మహాబలిపురం, తంజావూర్, చిట్టినాడ్, కుమరక్కం, కొచ్చి ప్రాంతాలను ఆరు రోజులు- ఏడు పగళ్ల సమయంలో చుట్టిరావచ్చు.
మూడు నెలలు మాత్రమే
పర్యటకులను ఆకర్షించాలనే లక్ష్యంతో అత్యాధునిక సౌకర్యాలను కల్పించారు. దేశంలో పర్యటకానికి ఊతమిచ్చేందుకు 2021 జనవరి నుంచి మార్చి వరకు దీన్ని నడపనుంది భారతీయ రైల్వే. దీనికి కావాల్సిన సదుపాయాలను కేంద్ర ప్రభుత్వం సమకూరుస్తుంది.
టిక్కెట్‌పై తగ్గింపు..
కుటుంబ సమేతంగా లేదా స్నేహితులతో కలిసి పర్యటిస్తే.. టిక్కెట్‌పై 50 శాతం తగ్గింపు ఉంటుంది. మొత్తం సందర్శన కోసం టిక్కెట్ కొనుగోలు చేస్తే 35 శాతం రీబేటు వర్తిస్తుంది. దీనికి ప్రతి ప్రయాణికుడి నుంచి కనీస ఛార్జీగా రూ.59,999 వసూలు చేస్తారు. దీనికి జీఎస్టీ అదనంగా ఉంటుంది.
104 మందికి మాత్రమే..
ఈ రైలులో ప్రయాణించడానికి 104 మందికి మాత్రమే అనుమతిస్తారు. రైలులో 11 విజిటర్ బోగీలు ఉంటాయి. ప్రతి బోగీలో నాలుగు గదులు ఉంటాయి. వీటిలో ఎన్-సూట్ విశ్రాంతి గదులు కూడా ఉన్నాయి. ఇందులో నిరంతరం వేడి నీటి సదుపాయం కూడా ఉంది. రెండు కేఫ్‌లు ఉంటాయి. వీటిలో 36 మంది ఒకేసారి ఉండవచ్చు.
దక్షిణ భారతదేశంలో.. కర్ణాటక రాష్ట్ర పర్యటక అభివృద్ధి సంస్థ (కేఎస్‌టీడీసీ) ఆధ్వర్యంలో నడిచే ఈ రైలును కొన్ని కారణాల వల్ల ఏడాది క్రితం నిలిపివేశారు.
ఇదీ చూడండి: 'చైనా, పాక్‌ను ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధమేనా?'