2019 ఆగస్టులో పారిశ్రామిక ఉత్పత్తి సూచీ(ఐఐపీ) 1.1 శాతానికి క్షీణించిందన్న నివేదికల నేపథ్యంలో ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు చేసింది. దేశ ఆర్థిక పరిస్థితి.. మాంద్యం నుంచి సంక్షోభం వైపు వేగంగా పరుగులు తీస్తోందని అభిప్రాయపడ్డారు కాంగ్రెస్ సీనియర్ నేత ఆనంద్ శర్మ. ద్రవ్య లోటు 3.3 శాతం కాదని.. 8 శాతం మించి ఉంటుందని పేర్కొన్నారు.
ప్రస్తుత భయానక పరిస్థితులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఆర్థికమంత్రి దిక్కుతోచని స్థితిలో ఉన్నారని విమర్శించారు ఆనంద్ శర్మ.
"దేశంపై సానుభూతి వ్యక్తం చేస్తున్నా. మన ఆర్థికమంత్రికి ఏం చెయ్యాలో తెలియడం లేదు. ఎకానమి, ఫైనాన్స్‌ను అర్థం చేసుకోలేకపోతున్నారు. దేశ ఆర్థిక రంగం చుట్టూ నెలకొన్న భయానక పరిస్థితులపై స్పందించకుండా.. ధనికులకు వడ్డీ రేట్లను తగ్గిస్తున్నారు. పేదలకు ఉపసమనం లభించడం లేదు. అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. విత్తమంత్రికి నిజంగా దేశ ఆర్థికరంగంపై ఆసక్తి ఉంటే.. పరిస్థితిని ఆర్థం చేసుకుని వెంటనే స్పందించాలి."
--- ఆనంద్ శర్మ, కాంగ్రెస్ సీనియర్ నేత.
మాంద్యం పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో దేశంలో పారిశ్రామిక ఉత్పత్తి తగ్గిపోయింది. తయారీ, విద్యుత్, మైనింగ్ రంగాల పనితీరు సరిగా లేకపోవడం వల్ల పారిశ్రామిక ఉత్పత్తి సూచీ(ఐఐపీ) ఆగస్టులో 1.1 శాతం క్షీణించింది. 2018లో ఇదే సమయంలో ఐఐపీ వృద్ధి 4.8 శాతంగా ఉంది.
ఐఐపీ గణాంకాలను గుర్తుచేస్తూ.. దేశంలో ఉత్పత్తి స్తంభించిందని, డిమాండ్ కుప్పకూలిందని తెలిపారు ఆనంద్ శర్మ. దేశ ఆర్థిక వ్యవస్థను సరిగా నిర్వహించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు.
ఇదీ చూడండి:- ప్రధాని మేనకోడలు పర్స్ చోరీ... ముమ్మర గాలింపు