వాయుసేనలో కాలం చెల్లిపోతున్న యుద్ధ విమానాల స్థానే మరో 200 ఫైటర్ జెట్లను సమకూర్చుకునేందుకు యోచిస్తోంది కేంద్రం. ఈ మేరకు రక్షణ కార్యదర్శి అజయ్ కుమార్ ప్రకటన విడుదల చేశారు. దేశీయ విమాన తయారీ సంస్థ హెచ్ఏఎల్తో 83 తేజస్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం తుదిదశలో ఉందని వెల్లడించారు. వాటితో పాటు మరో 110 విమానాల కొనుగోలుకు ప్రకటన విడుదల చేసినట్లు తెలిపారు.
"మొత్తంగా 200 యుద్ధ విమానాల కొనుగోలు ప్రక్రియ ఆయా దశల్లో ఉంది. హెచ్ఏఎల్ నుంచి తేజస్ మార్క్ 1 లైట్ కంబాట్ విమానాలను కొనేందుకు ఒప్పంద ప్రక్రియ తుది దశలో ఉంది. ఇవి భారత తక్షణ అవసరాలను తీరుస్తాయి."
-అజయ్‌కుమార్, రక్షణ కార్యదర్శి
యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందాలు రానున్న రోజుల్లో పూర్తవుతాయని పేర్కొన్నారు అజయ్‌కుమార్. సాధ్యమైనంత త్వరలో వైమానిక దళంలో యుద్ధవిమానాలు చేరే అవకాశం ఉందని చెప్పారు. అయితే హెచ్ఏఎల్కు ఏటా 8 నుంచి 16 యుద్ధ విమానాలు మాత్రమే తయారుచేసే సామర్థ్యం ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అవసరమైతే ఔట్ సోర్సింగ్ విధానం ద్వారా హెచ్ఏఎల్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచే దిశగా కృషి చేస్తామన్నారు.
ప్రస్తుతం వాయుదళంలో ఇవే
వైమానిక దళంలో ప్రస్తుతం సుఖోయ్ 30 ఎంకేఐ, మిరాజ్ 2000, మిగ్-29, మిగ్-21 బైసన్ వంటి యుద్ధ విమానాలు ఉన్నాయి. 2019 డిసెంబర్ 27న కార్గిల్ యుద్ధంలో సామర్థ్యం కనబరిచిన మిగ్-27 విమానాలను ఉపసంహరించారు.
ఇదీ చూడండి: 'కొంతమంది వామపక్ష విద్యార్థులతో విద్యా వ్యవస్థకు దెబ్బ'