సంయమనం పాటించి నిర్ణయాత్మకంగా వ్యవహరించడం భారత్ ప్రధాన లక్ష్యం అని, ఇతర దేశాలతో విభేదించటం తమ ఉద్దేశం కాదని కేంద్ర విదేశాంగశాఖ మంత్రి ఎస్. జయశంకర్ అన్నారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భారత్ కీలక పాత్ర పోషించాలని పలు దేశాలు ఆహ్వానించడంపై ఆయన స్పందించారు. వాణిజ్యపరంగా వ్యవహరించడం భారత్ మార్గం కాదని తెలిపారు. దిల్లీలో రైజీనా చర్చా వేదిక (రైజీనా డైలాగ్) అనే సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదంపై పోరాడే విషయంలో భారత్ ఎప్పటికీ వెనకంజ వేయదని తెలిపారు.
చైనాతో ఉన్న సంబంధాల గురించి వ్యాఖ్యానిస్తూ ‘‘కీలకమైన విషయాలపై పొరుగున ఉన్న దేశాలతో ఒక అవగాహన రావడం ఎంతో ముఖ్యమని అన్నారు. పరస్పరం సహకరించుకునే విధంగా భారత్-చైనా సంయమనంతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఎందుకంటే రెండు దేశాల మధ్య బంధం ప్రత్యేకమైనది’’ అని తెలిపారు.
ఈ సందర్భంగా అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలపై స్పందిచారు మంత్రి. రెండు దేశాలు విజ్ఞతతో వ్యవహరించి నిర్ణయం తీసుకుంటాయని ఆశిస్తున్నట్లు చెప్పారు.