ఆ నిర్ణయాన్ని కఠినంగా అమలు చేయాలి...
తూర్పు లద్దాఖ్‌లోని సమస్యాత్మక ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణపై కుదిరిన అంగీకారాన్ని కఠినంగా అమలు చేయాలని భారత్-చైనా నిర్ణయించాయి. సరిహద్దు సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవడానికి ఇది ఉపయోగపడుతుందని ఇరు వర్గాలు భావిస్తున్నట్టు భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. భారత్-చైనా మధ్య దౌత్య స్థాయిలో జరిగిన సమావేశం అనంతరం ఈ వ్యాఖ్యలు చేసింది విదేశాంగ శాఖ.
చైనా విదేశాంగ శాఖ డైరక్టర్ జనరల్ వూ జియాంగ్వో, భారత విదేశాంగ శాఖ సంయుక్త కార్యదర్శి(తూర్పు ఆసియా) నవీన్ శ్రీవాస్తవ.. బుధవారం ఉదయం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో గల్వాన్ ఘటన సహా తూర్పు లద్దాఖ్‌లో నెలకొన్న ఉద్రిక్తతలపై చైనాకు భారత్ తన ఆందోళనను వ్యక్తం చేసింది. సరిహద్దు వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించుకోడానికి దౌత్య, మిలిటరీ స్థాయిలో సమాచారాలను ఇచ్చిపుచ్చుకునేందుకు అధికారులు అంగీకరించారు.
ఇదీ జరిగింది...
వాస్తవాధీన రేఖ వెంబడి.. మే నెల నుంచి భారత సైనికులపైకి చైనా కయ్యానికి కాలుదువ్వుతోంది. ఈ నెల 15న గల్వాన్ లోయలో జరిగిన హింసాత్మక ఘటన అనంతరం ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి. గల్వాన్ ఘటనలో 20మంది భారత జవాన్లు అమరులయ్యారు.