వేలాది పాటలతో కోట్లాది మందికి సంగీత మాధుర్యం పంచిన గానగంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.
"ప్రముఖ నేపథ్య గాయకుడు, ఐదున్నర దశాబ్దాలుగా తమ అమృత గానంతో ప్రజలను అలరింపజేసిన ఎస్పీ బాలు అనారోగ్య కారణాలతో పరమపదించడం దిగ్భ్రాంతి కలిగించింది. వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.
వారు కరోనా బారినపడి ఎంజీఎం ఆసుపత్రిలో చేరారని తెలిసినప్పటి నుంచి వైద్యులతో రోజూ మాట్లాడుతూ.. ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య పరిస్థితిని వాకబు చేస్తూ వచ్చాను. ఆయన కుమారుడితో మాట్లాడి కావాల్సిన సలహాలు ఇస్తూ వైద్యులకు సూచనలు చేస్తుండేవాడిని. వారు కోలుకుంటున్నారని భావిస్తున్న తరుణంలోనే ఇలా జరగడం విచారకరం. వివిధ భారతీయ భాషల్లో ఎన్నో పాటలకు ప్రాణం పోసిన శ్రీ బాలు 'ఈటీవీ'లో 'పాడుతా తీయగా' కార్యక్రమం ద్వారా వేలాది యువ తెలుగు గళాల్ని వెలుగులోకి తీసుకొచ్చారు."
- వెంకయ్య నాయుడు, ఉపరాష్ట్రపతి
"గాన గంధర్వుడైన శ్రీ ఎస్పీ బాలు మా ఊరివాడైనందున చిన్నప్పటినుంచి చాలా పరిచయముంది" అన్నారు వెంకయ్య. ఆయన కోలుకుంటున్నారని, రోజూ కుటుంబసభ్యులతో కాసేపు మాట్లాడుతున్నారని తెలిసి సంతోషిస్తుండగానే ఇలా జరగడం బాధాకరమని తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు.
- ఇదీ చదవండి: గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇకలేరు