ఓ రోజు ఇంటిపై నుంచి హెలికాప్టర్ వెళ్లింది. కింద డాబాపై నుంచి చూస్తున్న ఇల్లాలికి దానిపై పయనించాలని ఆశ కలిగింది... హెలికాప్టర్లో కూర్చుంటే ఆ అనుభూతి ఎలా ఉంటుంది... ఎంత ఖర్చవుతుంది వంటి ప్రశ్నలేసింది భర్తను. అంతే...! మనసులో ఆ రోజే అనుకున్నాడా ఉత్తమ భర్త... ఎలాగైనా తన భార్య సోమోటిని హెలికాప్టర్లో తిప్పాలని నిర్ణయించుకున్నాడు... శనివారం తన పదవీ విరమణ రోజున.. ఆయన అర్థాంగిని చాపర్‌లో తిప్పి ఆశ్చర్యపరిచాడు.
రాజస్థాన్ అల్వార్ జిల్లా మాలావళి గ్రామానికి చెందిన రమేశ్ చంద్ మీనా సీనియర్ ఉపాధ్యాయుడు. లక్ష్మణ్‌గఢ్‌లోని ఓ పాఠశాలలో.. ఉపాధ్యాయ వృత్తిలో 34 ఏళ్లపాటు సేవలందించాడు. శనివారం తన పదవీ విరమణ సందర్భంగా భార్య కోర్కె తీర్చడం కోసం 3 లక్షల 70 వేలు ఖర్చు పెట్టి దిల్లీ నుంచి ఓ చాపర్‌ను బుక్ చేశాడు. స్కూల్ నుంచి 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన ఇంటికి సతీమణితో కలసి ఆ హెలికాప్టర్లోనే వెళ్లారు. ఈ కార్యక్రమాన్ని చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు హెలీప్యాడ్ వద్ద భారీసంఖ్యలో గుమిగూడారు. ఇంటి వద్దా వారికి ఘనస్వాగతం పలుకుతూ ఏర్పాట్లు చేశారు.
"హెలికాఫ్టర్ ద్వారా మాకు ఎంత సంతోషం రావాలో అంతా వచ్చింది. చాలా మంచి పని చేశాను. హెలికాప్టర్ బుక్ చేయడానికి కారణం... నా సతీమణిని అందులో తిప్పాలనుకోవడమే."
- రమేశ్ చంద్ మీనా, భార్యను హెలికాప్టర్లో తిప్పిన వ్యక్తి
హెలికాప్టర్ ప్రయాణానికి అనుమతినిచ్చిన జిల్లా యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలిపారు రమేశ్ చంద్. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు. ఒకరు ఉపాధ్యాయ వృత్తిలోనే కొనసాగుతుండగా.. మరొకరు ఎఫ్‌సీఐలో ఇన్స్పెక్టర్.
ఇదీ చూడండి :భారత్‌తో ద్వైపాక్షిక చర్చలకు సిద్దం: ఖురేషీ