కర్ణాటక బెంగళూరులో రూ.9 లక్షలు చెల్లిస్తేనే మృతదేహాన్ని అప్పగిస్తామని మొండికేసింది ఓ ప్రైవేటు ఆసుపత్రి.
కొద్దిరోజుల క్రితం బెంగళూరుకు చెందిన అఫ్రోజ్ బీ అనే మహిళకు కరోనా సోకిందని తేలింది. శ్వాసకోశ సమస్యతో జులై 13న వైట్ ఫీల్డ్ లోని మనిపాల్ ఆసుపత్రిలో చేరింది. సరైన సమయానికి చికిత్స అందక మృతి చెందింది. అయితే, మృతదేహాన్ని బంధువులకు అప్పగించాలంటే పూర్తి బిల్లు చెల్లించాల్సిందేనని తెగేసి చెప్పారు ఆసుపత్రి సిబ్బంది.
బంధువులు అంత డబ్బు ఎలా కట్టగలమని, వైద్యులతో మాట్లాడినా లాభం లేకపోయింది. ఆఖరికి బృహత్ బెంగళూరు మహనగర పాలక సంస్థ అధికారులు ఆదేశించినా వినలేదు. దాదాపు 28 గంటలు ఆసుపత్రి బయటే నిలబడి మృత దేహం అప్పగించాలని ప్రాధేయపడ్డారు కుటుంబ సభ్యులు. అయినా కనికరించలేదు.
అయితే ఆ రాష్ట్ర మంత్రి బైరాతి బసవరాజు స్థానిక సర్కారు ఆసుపత్రిని పరిశీలించేందుకు వచ్చారు. ఆ సమయంలో అఫ్రోజ్ కుటుంబ సభ్యులు మంత్రికి పరిస్థితి వివరించారు. దీంతో మంత్రి ఆసుపత్రిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే మృతదేహాన్ని అప్పగించాలని ఆదేశించారు. దీంతో యాజమాన్యం దిగొచ్చింది. అఫ్రోజ్ మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించింది.
ఇదీ చదవండి: వినాలంటే కొండెక్కాల్సిందే.. టెంట్ వేయాల్సిందే!