పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి దాదాపు 230 మంది ఉగ్రవాదులు దేశంలో చొరబడే అవకాశం ఉందన్న నిఘా వర్గాల సమాచారంతో కేంద్రం అప్రమత్తమైంది. జమ్ముకశ్మీర్ భద్రతా పరిస్థితులపై హోం మంత్రి అమిత్ షా దిల్లీలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. అక్కడి తాజా పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.
జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్, కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా, ఇతర నిఘా సంస్థల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 2 గంటలకు పైగా జరిగిన భేటీలో జమ్ముకశ్మీర్ నియంత్రణ రేఖ, అంతర్జాతీయ సరిహద్దు వెంబడి తాజా పరిస్థితులను అమిత్ షాకు నివేదించారు.
కశ్మీర్ లోయతో పాటు సరిహద్దు వెంట ప్రశాంత వాతావరణం సృష్టించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.
సరిహద్దు వెంబడి ఇటీవల అక్రమ చొరబాటు ప్రయత్నాలు పెరిగాయని లెఫ్టినెంట్ జనరల్ కేజేఎస్ ధిల్లాన్ పేర్కొన్నారు. పాక్ ఉగ్రవాదులు భారత్‌లో ఉగ్రకార్యకలాపాలకు పాల్పడే అవకాశముందని హెచ్చరించారు.
మోదీతో మాలిక్ భేటీ
జమ్ముకశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్.. ప్రధానితో భేటీ అయ్యారు. కశ్మీర్ లోయలో ప్రస్తుత భద్రతా పరిస్థితులపై ప్రధాని అడిగి తెలుసుకున్నట్లు సమాచారం.
అధికరణ 370 రద్దు అనంతరం.. కశ్మీర్లో వరుసగా 43వ రోజూ సాధారణ జనజీవనం ప్రభావితమైంది. పలు చోట్ల ఆంక్షలు కొనసాగుతున్నాయి. అంతర్జాల సేవలు చాలా చోట్ల నిలిచిపోయాయి. తాజాగా ఉగ్రహెచ్చరికల నేపథ్యంలో కశ్మీర్‌లోయలోని పలు ప్రాంతాల్లో భద్రత మరింత కట్టుదిట్టం చేశారు.