జమ్ము-కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో భద్రతా దళాల ఎదురుకాల్పులకు హతమైన హిజ్భుల్ కమాండర్ రియాజ్ నాయకూ.. ఒకప్పుడు లెక్కల మాస్టారు. ముష్కరబాట పట్టినందుకు తగిన మూల్యం చెల్లించుకున్నాడు. నాయకూ రైతు కుటుంబంలో జన్మించాడు. పుల్వామాలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశాడు. అనంతరం ఓ ప్రైవేటు పాఠశాలలో లెక్కల మాస్టారుగా పనిచేశాడు. అల్లర్ల కేసులో 2010లో బలగాలు అతణ్ని అరెస్టు చేశాయి. 2012లో విడుదలయ్యాడు.
భోపాల్ విశ్వవిద్యాలయంలో ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకుంటా నంటూ 2012 మే 21న నాయకూ తన తండ్రిని రూ.7 వేలు అడిగాడు. ఆపై ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. ఉగ్రవాదిగా మారాడు. హిజ్భుల్ లో చేరాడు. 2016లో శోపియాలో ఓ ఉగ్రవాది అంత్యక్రియల్లో నాయకూ ప్రత్యక్షమయ్యాడు. మరణించిన ఉగ్రవాదికి నివాళిగా తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపాడు. తొలినాళ్లలో హిజ్భుల్ లో చాలావరకు తెరవెనుక కార్యకలాపాలకే నాయకూ పరిమితమయ్యేవాడు. తదనంతర పరిణామాల్లో 2017లో అతడు హిజ్భుల్ పగ్గాలు చేపట్టాడు.
ఎవర్నీ నమ్మడు
నాయకూ హిజ్భుల్ లో ఉగ్ర సహచరులెవర్నీ నమ్మేవాడు కాదు. తర్వాత ఏం చేయబోతున్నాడన్నది ఎవరికీ తెలియనిచ్చేవాడు కాదు. నాయకూకు సాంకేతిక పరిజ్ఞానం ఎక్కువ. తన కదలికలను బలగాలు ఎలక్ట్రానిక్ ఆధారాలతో కనిపెట్టకుండా జాగ్రత్తగా వ్యవహరించేవాడు.
పోలీసుల బంధువులను బంధించి..
పోలీసులు తన తండ్రిని అదుపులోకి తీసుకోవడం వల్ల.. 2018 సెప్టెంబరులో నాయకూ 11 మందిని బంధించాడు. వారంతా పోలీసు అధికారుల బంధువులు. తండ్రిని పోలీసులు విడిచిపెట్టాక, తన దగ్గర ఉన్న బందీలను అతడు వదిలేశాడు. నాయకూపై మొత్తం 12 కేసులున్నాయి. అతడు ఎప్పుడూ పాకిస్థాన్‌కు మద్దతు పలికేవాడు. ఉగ్ర నిరోధక ఆపరేషన్లకు దూరంగా ఉండాలని పోలీసులను హెచ్చరిస్తూ గతంలో చాలా వీడియోలు, ఆడియోలను విడుదల చేశాడు.