దేశంలో కరోనా వ్యాప్తి, నియంత్రణ దిశగా తీసుకుంటున్న చర్యలపై కీలక ప్రకటన చేసింది ఆరోగ్య శాఖ. భారత్లో వైరస్ నయమయ్యే వారి శాతం 29.36 శాతంగా ఉందని చెప్పింది. కరోనా నియంత్రణ దిశగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను కచ్చితంగా పాటిస్తే కేసుల సంఖ్యను తగ్గించవచ్చని స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా వైరస్ ప్రభావిత ప్రాంతాలను పునఃసమీస్తామని తెలిపింది కేంద్రం. అనంతరం ఆయా జోన్ల పరిధిలోకి వచ్చే ప్రాంతాలను గుర్తించి రాష్ట్రాలకు సమాచారం ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది.
216 జిల్లాల్లో కేసుల్లేవు..
ఆరోగ్య శాఖ ప్రకటన ప్రకారం దేశవ్యాప్తంగా ఉన్న 42 జిల్లాల్లో గత 28 రోజులుగా వైరస్ కేసులు నమోదు కాలేదు. 29 జిల్లాల్లో 21 రోజులుగా కొత్తగా ఎవరికీ కరోనా సోకలేదు. 36 జిల్లాల్లో 14 రోజులుగా.. 46 జిల్లాల్లో 7 రోజులుగా ఒక్కరు కూడా మహమ్మారి బారిన పడలేదు. 216 జిల్లాల్లో ఇప్పటివరకు ఒక్కరికి కూడా వైరస్ సోకలేదు.
'వైరస్ లక్షణాలు లేని వారే వెనక్కి'
విదేశాల్లోని భారతీయుల తరలింపుపై స్పష్టత ఇచ్చింది కేంద్రం. వైరస్ లక్షణాలు లేనివారినే తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. వెనక్కి తీసుకొచ్చినవారిని తప్పనిసరి నిర్బంధంలో ఉంచుతున్నట్లు స్పష్టం చేసింది.
వలసకార్మికుల కోసం..
వలసకార్మికుల కోసం 222 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు తెలిపింది హోంశాఖ. ఇలా ఇప్పటివరకు 2,50,000 మందిని స్వస్థలాలకు చేర్చినట్లు వెల్లడించింది.
ఇదీ చూడండి: చైనా బోర్డర్లో కొత్త రోడ్- సైన్యానికి మరింత వెసులుబాటు