ఉగ్రవాదం, వేర్పాటువాదంతో సతమతమవుతున్న జమ్ముకశ్మీర్‌లో కీలక మార్పు చోటు చేసుకుంది. కశ్మీర్ వేర్పాటువాద సంస్థ హురియత్ కాన్ఫరెన్స్‌కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు అగ్రనేత సయ్యద్ అలీషా గిలానీ. హురియత్ నుంచి తప్పుకుంటున్నట్లు రాసిన రాజీనామా లేఖను మీడియాకు విడుదల చేశారు.
హురియత్‌కు జీవిత కాల ఛైర్మన్‌గా ఉన్న గిలానీ తన నిర్ణయానికి గల కారణాలను వివరిస్తూ అనుచరులకు సుదీర్ఘ లేఖ రాశారు. హురియత్ కాన్ఫరెన్స్‌లో తన ప్రాధాన్యం తగ్గిపోవడాన్ని సహించలేకే రాజీనామా అస్త్రాన్ని గిలానీ సంధించారని తెలుస్తోంది.
లేఖలో ఏముందంటే..
2003లో హురియత్ పగ్గాలు చేపట్టమని తనను నేతలు బలవంతం చేశారని.. అనంతరం జీవిత కాలం ఛైర్మన్‌గా బాధ్యతలు అప్పగించారని గుర్తు చేశారు గిలానీ. తన నాయకత్వంపై సభ్యుల్లో వ్యతిరేకత వ్యక్తమవుతుండటం రాజీనామాకు కారణాల్లో ఒకటని చెప్పారు. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని హురియత్ సభ్యులపై వస్తున్న ఆరోపణలపై ప్రస్తుతం విచారణ జరుగుతున్నట్లు చెప్పారు.
"పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని హురియత్ సభ్యుల కార్యకలాపాలు ప్రస్తుతం తగ్గాయి. వారు అక్కడి అసెంబ్లీ, మంత్రిత్వ శాఖల్లోకి వెళ్లేందుకు అనుమతి కోరుతున్నారు. కొంతమందిని బహిష్కరించాం. మరికొందరు సొంతంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. వారి నిర్ణయాలను ఆమోదించేందుకు ఇక్కడ మీరు సమావేశాలు నిర్వహిస్తున్నారు. తదుపరి కార్యాచరణను నిర్ణయించడం కోసం మీతో మాట్లాడాలని అనేక సార్లు సందేశాలు పంపాను. కానీ నా ప్రయత్నాలు వ్యర్థమయ్యాయి. ఆర్థిక, ఇతర అంశాల్లో మీ విశ్వసనీయతపై అనుమానాలు నెలకొన్నాయి."
- లేఖలో గిలానీ
ఇదీ చూడండి: 'కశ్మీర్లో భాగమైనా.. ఆ జిల్లా ఉగ్రవాద రహితం'