భారత్-చైనా సరిహద్దు వెంట భయంకరమైన శీతాకాలం ముంచుకొస్తున్న నేపథ్యంలో.. ఇరు దేశాల మధ్య సోమవారం 11 గంటల పాటు సుదీర్ఘ చర్చలు జరిగాయి. చుషుల్ సెక్టార్లో జరిగిన ఈ మారథాన్ చర్చల తర్వాత సరిహద్దు ఉక్కపోత.. కాస్త చల్లబడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
శీతాకాలం దృష్ట్యా ఇరు పక్షాలు సరిహద్దులో ఇప్పటికే మోహరించిన బలగాల ఉపసంహరణకు అంగీకరించాయి. అయితే, బలగాలను వెనక్కి తీసుకోవటంలో వ్యూహాత్మకంగా వ్యవహరించే అవకాశముంది. సరిహద్దులోని ఇబ్బందికర ప్రాంతాల్లోనే ఇది జరగొచ్చు.
అయితే, ఇందుకోసం నిర్దిష్ట గడువు ఏదీ అనుకోలేదు. ఇప్పటికిప్పుడే జరగాలని నిర్ణయించలేదు. ఈ నేపథ్యంలో ఉన్నత స్థాయి చర్చలే ఈ సరిహద్దు వివాదాలను పరిష్కరించగలవు.
-ఈటీవీ భారత్తో ఓ విశ్లేషకుడు
సంయుక్త ప్రకటనలు
ఈ నేపథ్యంలలో సోమవారం చర్చలు ముగిసిన అనంతరం మంగళవారం ఇరుదేశాలు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. "ఇరుపక్షాలు బలగాల ఉపసంహరణపై నిజాయితీగా, లోతైన చర్చలు జరిపాయి. నియంత్రణ రేఖ వెంట, సరిహద్దులోని పశ్చిమ సెక్టార్లో సైనికులను వెనక్కి రప్పించటంపై సమీక్షించాయి. ఈ నిర్మాణాత్మక చర్చలు, ఫలవంతంగా సాగాయి. సరిహద్దులో స్థానాల గురించి ఒకరికొకరు అవగాహన పెంచుకున్నాం." అని వెల్లడించాయి
అన్నింటికంటే ముఖ్యంగా ఈ ప్రకటనలో ఇరుపక్షాలు "రెండు దేశాల నాయకుల మధ్య కుదిరిన ఏకాభిప్రాయాలను అమలు చేసేందుకు చూస్తున్నాం." అని తెలిపాయి.
ఇదీ చూడండి: 'సరిహద్దులో శాంతికి భారత్-చైనా అంగీకారం'
అనధికారిక సమావేశాలు
మోదీ-జిన్పింగ్ మధ్య ఇప్పటికే రెండు అనధికారిక సమావేశాలు జరిగాయి. 2018 ఏప్రిల్ 27-28 మధ్య వుహాన్లో మొదటిది జరగగా.. అక్టోబర్ 12, 2019లో మామల్లాపురంలో రెండోసారి కలిశారు. ఇరువురు నేతలూ.. ఈ ఏడాది నవంబర్ 17న రష్యా అధ్యక్షతన జరగనున్న బ్రిక్స్ సదస్సులో సమావేశం అవ్వాల్సి ఉంది. వర్చువల్గా ఈ సమావేశం జరగనుంది.
ఈ ఏడాది ఏప్రిల్-మేలో మొదలైన సరిహద్దు ఉద్రిక్తతలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇరు దేశాలు సరిహద్దు వెంట 1,00,000 సైనికులను మోహరించాయి. యుద్ధ సన్నద్ధత చాటిన ఇరు దేశాలు సరిహిద్దు వేడి మరింత పెంచాయి.
చర్చల పరంపర
ఓవైపు మాటల యుద్ధం నడుస్తున్న నేపథ్యంలోనే.. ప్రత్యర్థి ఎత్తులు చిత్తులు చేస్తూ వ్యూహప్రతివ్యూహాలు రచించాయి. ఆసియా దిగ్గజాల మధ్య వరుస చర్చలు సైతం జరిగాయి. రక్షణ, విదేశాంగ శాఖల మంత్రులు, ప్రత్యేక ప్రతినిధులు, వివిధ స్థాయి అధికార, సైనిక వర్గాలు సరిహద్దు వివాదాలు సద్దుమణగటమే లక్ష్యంగా సమావేశాలు నిర్వహించారు.
తాజాగా.. ఇరు దేశాల మధ్య ఏడో కమాండర్ స్థాయి చర్చలు జరిగాయి. వీటలో సైన్యాధికారులతో పాటు భారత్-చైనా విదేశాంగ శాఖల దౌత్యవేత్తలు సైతం పాల్గొన్నారు.
చైనా తరఫున ఈ శాంతి చర్చల్లో.. ఉన్నత స్థాయి చైనా స్టడీ గ్రూప్ పాల్గొందని భారత్ వర్గాలు భావిస్తున్నాయి. భారత్ తరఫున 14కార్ప్స్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ హరీందర్ సింగ్, మరో లెఫ్టినెంట్ జనరల్ పీజీకే మేనన్తో పాటు విదేశాంగ శాఖ సంయుక్త కార్యదర్శి నవీన్ శ్రీవాస్తవ పాల్గొన్నారు. హరీందర్ సింగ్ పాల్గొన్న చివరి చర్చలు ఇవే.
-సంజీవ్ బారువా