అమెరికాలోని హ్యూస్టన్‌లో హౌడీ-మోదీ కార్యక్రమానంతరం.. మరోమారు రెండు అత్యంత శక్తిమంతమైన దేశాల మధ్య బంధాన్ని ప్రపంచానికి చాటిచెప్పే కార్యక్రమానికి అహ్మదాబాద్ వేదిక కానుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. 'నమస్తే ట్రంప్' కార్యక్రమంలో మరోసారి ఒకే వేదికను పంచుకోనున్నారు.
రెండు రోజుల పర్యటనలో భాగంగా ఈనెల 24న భారత్‌కు రానున్నారు ట్రంప్. ఇందుకోసం గుజరాత్ ప్రభుత్వం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది.
మోటేరా క్రికెట్ మైదానంలో..
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో నూతనంగా నిర్మించిన మోటేరా క్రికెట్ మైదానంలో నమస్తే ట్రంప్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అంతకు ముందు విమానాశ్రయం నుంచి స్టేడియం వరకు 22 కిలోమీటర్ల మేర భారీ రోడ్ షోలో పాల్గొంటారు ట్రంప్. పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరుకానున్న నేపథ్యంలో అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
50 వేదికలు..
రోడ్ షోలో జాతీయ కళలను ప్రదర్శించేందుకు దేశవ్యాప్తంగా ఉన్న కళాకారులను ఆహ్వానించింది గుజరాత్ ప్రభుత్వం. ఇందుకోసం రోడ్ షో జరిగే మార్గంలో మొత్తం 50 వేదికలు ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల కళాకారుల కోసం 30, ఇతర ప్రదర్శనల కోసం 20 వేదికలు ఉంటాయి. కార్యక్రమంలో వందల మంది కళాకారులు.. సాంస్కృతిక, నృత్య కళలు ప్రదర్శించనున్నారు.
దూరదర్శన్.. 100 కెమెరాలు..
రోడ్ షోను ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం అందించనుంది దూరదర్శన్. ఇందుకోసం ఈ మార్గంలో 100 కెమెరాలు ఏర్పాటు చేసింది.
1.25 లక్షల మంది..
నమస్తే ట్రంప్ కార్యక్రమానికి సుమారు 1.25 లక్షల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు అధికారులు. మోటేరా క్రికెట్ స్టేడియంలో సుమారు 1.10లక్షల మంది కూర్చోవచ్చు. మరో 10 వేల మంది వీఐపీల కోసం మైదానంలో మరో వేదికను ఏర్పాట్లు చేయనున్నారు. ఇప్పటికే మైదానం సమీపంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
'రాస్' నృత్యంతో స్వాగతం..
సంప్రదాయ జానపద నృత్యం 'రాస్' ద్వారా అధ్యక్షుడు ట్రంప్‌నకు స్వాగతం పలకనున్నారు. పోర్బందర్కు చెందిన ప్రముఖ జానపద కళాకారులు. ఛాయ మెహర్ మనియార, లీర్బాయ్ రాస్ మండల్ బృందాలు ఇందులో పాల్గొననున్నాయి. ఈనెల 23న ప్రధాని మోదీ అహ్మదాబాద్‌కు చేరుకోనున్న సందర్భంగా రాస్ నృత్యాన్ని మొదట ప్రదర్శిస్తారు. కొద్ది రోజులుగా ఈ రెండు బృందాలు పోర్బందర్లో సాధన చేస్తున్నాయి.
రోడ్‌షోలో డ్రోన్ నిరోధక వ్యవస్థ...
ఇటీవలి కాలంలో ఉగ్రవాదులు డ్రోన్లు వినియోగిస్తున్న నేపథ్యంలో.. అహ్మదాబాద్‌లో నిర్వహించే భారీ రోడ్ షోలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు అధికారులు. భారత రక్షణ పరిశోధన సంస్థ (డీఆర్డీఓ) రూపొందించిన డ్రోన్ నిరోధక వ్యవస్థను మోహరించారు. ప్రస్తుతం దాన్ని రోడ్‌షో నిర్వహించే ప్రాంతంలో పరీక్షిస్తున్నారు. అలాగే స్థానిక పోలీసులు, రాపిడ్ యాక్షన్ ఫోర్స్, ఎస్ఆర్పీఎఫ్, చెతాక్ కమాండోలు, తీవ్రవాద నిరోధక దళాన్ని మోహరించనున్నారు.
ఆర్ఏఎఫ్ అధీనంలోకి మైదానం..
అహ్మదాబాద్‌లోని మోటేరా స్టేడియాన్ని ఇప్పటికే తమ అధీనంలోకి తీసుకోనుంది రాపిడ్ యాక్షన్ ఫోర్స్. మైదానంలో అణువణువు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు సిబ్బంది.
25 పడకల ఆస్పత్రి..
వేల మంది హాజరవుతున్న క్రమంలో ఆరోగ్య పరమైన సమస్యలు తలెత్తితే ఇబ్బందులు పడకుండా.. స్టేడియం వద్ద 25 పడకల తాత్కాలిక ఆస్పత్రిని ఏర్పాటు చేస్తున్నారు. 50 అంబులెన్సులు అందుబాటులో ఉండనున్నాయి. మోటేరా మైదానానికి చేరుకునేందుకు 2350 బస్సులు నడపనుంది గుజరాత్ ప్రభుత్వం. 93 వైద్య బృందాలు సేవలందించనున్నాయి.
ఇదీ చూడండి: ట్రంప్ తాజ్‌మహల్ పర్యటనకు కోతుల బెడద