కరోనాను కట్టడి చేసేందుకు విధించిన లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన ఆడం మాలిక్ సాబా, 22 సంవత్సరాల తర్వాత తన తల్లిదండ్రుల చెంతకు చేరాడు. అతని రాక ఆ కుటుంబంలో సంతోషాన్ని నింపింది.
అసలేమైంది..?
మాలిక్ సాబా బాగవానా- బదిమా దంపతులకు నలుగురు కుమారులు, ఆరుగురు కుమార్తెలు. వారి స్వస్థలం కర్ణాటక గదగ్ జిల్లాలోని గొగేరీ గ్రామం. కుటుంబ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఆడం మాలిక్ సాబా పైచదువులు చదవకుండానే తన సోదరుడితో కలిసి పుణెలోని ఓ హోటల్లో పని చేయాల్సివచ్చింది. 1998లో తన స్నేహితులతో విహారయాత్రకు ముంబయి వెళ్లిన సమయంలో ఆడం తప్పిపోయాడు. అతని తల్లిదండ్రులు పుణె, ముంబయిలో 6 సంవత్సరాలు వెతికి ఆశలు వదులుకున్నారు. అయితే అప్పుడు అదృశ్యమైన ఆడం.. సోలాపూర్‌లోని ఓ హోటల్లో పని ప్రారంభించాడు.
ఉపాధి పోయింది ఊరు గుర్తొచ్చింది..
ఇన్నాళ్లూ సాఫీగా సాగిపోయిన మాలిక్ సాబా జీవితానికి.. లాక్డౌన్ కారణంగా బ్రేక్ పడింది. హోటల్లో ఉపాధి కోల్పోయిన అతని చేతిలో చిల్లిగవ్వ లేదు. ఉపాధి కరవైంది. పూట గడవని పరిస్థితిలో మాలిక్‌కు.. తన తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు, సొంత ఊరు గుర్తొచ్చాయి. ఈ తరుణంలో సోలాపూర్ నుంచి గొగేరీ గ్రామంలోని తన తల్లిదండ్రుల చెంతకు పయనమయ్యాడు.
సొంత ఊరికి వచ్చాక..
ఊళ్లోకి రాగానే మాలిక్సాబా.. తన ఇల్లు ఉన్న ప్రాంతానికి వెళ్లాడు. గ్రామ ప్రజలను తన తల్లిదండ్రుల వివరాలు అడిగి తెలుసుకున్నాడు. అప్పటికే ఆడం వచ్చాడని తెలుసుకున్న బంధువు ఒకరు అక్కడికి వచ్చి అతడిని తీసుకెళ్లాడు.
22 సంవత్సరాల తర్వాత ఇంటికి వచ్చిన కుమారుడిని.. అతని తల్లిదండ్రులు పుట్టుమచ్చలు, చేతి వేలు, కుడి కాలు తదితర ఆధారాలతో గుర్తించారు.
తల్లి అంచనా నిజమైంది :
ఆరు నెలల క్రితం బదిమా తన కుటుంబసభ్యులతో 'ఆడం వస్తాడు.. ఆస్తిలో అతనికి భాగం ఇవ్వాలి' అని చెప్పిందంట. చివరకు ఆ తల్లి మాటలే నిజమయ్యాయి.
కుటుంబ సభ్యులంతా మరిచిపోయినా.. ఆడం తల్లి బదిమా మాత్రం కన్న కొడుకు కోసం ఎదురుచూస్తూనే ఉంది. 22 సంవత్సరాల ఆ తల్లి నిరీక్షణ ఫలించింది. లాక్డౌన్ కారణంగా.. మాలిక్ ఇంటికి వచ్చాక తల్లి ఆనందానికి అవధుల్లేవు. ప్రస్తుతం ఆడం.. క్వారంటైన్లో ఉన్నాడు.