కరోనా వ్యాప్తి నేపథ్యంలో దిల్లీ ప్రభుత్వం విధించిన ఆంక్షలను లెక్కచేయట్లేదు షాహీన్‌బాగ్ నిరసనకారులు. వందలాది మంది పౌరచట్టానికి వ్యతిరేకంగా ప్రదర్శన చేపట్టారు. కొవిడ్-19 వైరస్ విస్తరిస్తున్న కారణంగా.. 50మంది కంటే ఎక్కువగా గుమికూడొద్దని ప్రభుత్వం ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను బేఖాతరు చేశారు ఆందోళనకారులు. ఈ నిరసనల్లో మహిళలు, కళాశాల విద్యార్థులు, యువకులు సహా చిన్న పిల్లలూ పాల్గొన్నారు.
వైరస్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకొని.. నిరసనలను విరమించుకోవాలని ఆందోళనకారులతో నచ్చజెప్పే ప్రయత్నం చేశారు పోలీసులు. ప్రదర్శనలో పాల్గొన్నవారికి మాస్కులు, శానిటైజర్లు అందించడం మానేసి.. అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆందోళనకారులు మండిపడ్డారు. అలాంటివేమీ చేయకుండా.. ఈ సమస్యను తప్పుదారి పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.
90 రోజులుగా ఆందోళనలు..
దిల్లీ షాహీన్‌బాగ్‌లో సీఏఏ వ్యతిరేక నిరసనలు గతేడాది డిసెంబర్ 15న మొదలయ్యాయి. ఇప్పటికే 90 రోజులు దాటినా ఆందోళనలు ఆగకపోవడం గమనార్హం.