దేశంలో అంతకంతకూ విస్తరిస్తున్న కరోనా వైరస్ కోరలు పీకేందుకు కేంద్రం కఠిన నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. కరోనా ప్రభావం అధికంగా ఉన్న 80 జిల్లాల్లో లాక్డౌన్ ప్రకటించాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించిన కేంద్రం.. మహమ్మారిని తరిమికొట్టేందుకు 144 సెక్షన్ తరహా నిషేధాజ్ఞలను అమలు చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. జనతా కర్ఫ్యూ ద్వారా ప్రజల నుంచి వచ్చిన విశేష స్పందనను గమనించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
ఈ రాష్ట్రాల్లో లాక్డౌన్..
కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు పలు రాష్ట్రాలు లాక్డౌన్ ప్రకటించాయి. దిల్లీ, పంజాబ్, ఉత్తరాఖండ్, ఝార్ఖండ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ఈ నెల 31వరకు లాక్డౌన్ ప్రకటించారు. రాజస్థాన్‌లో ఇప్పటికే అమల్లో ఉంది. నాగాలాండ్‌లో ఇప్పటివరకు ఒక్క కరోనా పాజిటివ్ కేసు నమోదుకానప్పటికీ ముందుజాగ్రత్త చర్యగా నిరవధిక లాక్డౌన్ ప్రకటించింది ఆ రాష్ట్ర ప్రభుత్వం.
- ఛత్తీస్‌గఢ్‌లోని అన్ని పట్టణ ప్రాంతాల్లో లాక్డౌన్ ప్రకటించారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేశ్ బగేల్.
- బిహార్‌లోని అన్ని పట్టణాలను ఈ నెలాఖరు వరకు లాక్‌డౌన్‌గా ప్రకటించింది ప్రభుత్వం.
- ఉత్తర్‌ప్రదేశ్‌లో కరోనా ప్రభావం ఉన్న 16 జిల్లాల్లో లాక్డౌన్ విధించారు.
- మహారాష్ట్ర, గుజరాత్, హరియాణా, ఒడిశా, హిమాచల్ ప్రదేశ్ సహా.. దాదాపు అన్ని రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో లాక్డౌన్ ప్రకటించారు.
396కు చేరిన కేసులు..
దేశంలో కరోనా కేసులు 396కు చేరాయి. ఆదివారం ఒక్కరోజే 64 కొత్త కేసులు బయటపడ్డాయి. మృతుల సంఖ్య 7 కు పెరిగింది. వైరస్‌ను కట్టడి చేసేందుకు మరిన్ని కఠిన చర్యలకు సిద్ధమైన కేంద్రం.. మొత్తం రైళ్లను నిలిపేసింది. అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులను ఆపేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది.
కొత్త కేసులు
మహారాష్ట్రలో ఆదివారం 10 కొత్త కేసులు నమోదు కాగా మొత్తం సంఖ్య 74కు చేరుకుంది. ముంబయిలో 24, పుణెలో 15 మందికి వైరస్ పాజిటివ్‌గా నిర్ధరించారు. కేరళలో మొత్తం కేసులు 64కు చేరగా.. ఒక్కరోజు వ్యవధిలో 15 మంది వైరస్ బారినపడ్డారు.
తెలంగాణ, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో 6 చొప్పున కొత్త కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో మొత్తం బాధితుల సంఖ్య 27కు, కర్ణాటకలో 26కు చేరింది. రాజస్థాన్‌లో 3 కొత్త కేసులు సహా మొత్తం బాధితుల సంఖ్య 28కి పెరిగింది. దిల్లీలో మొత్తం కేసులు 30కి, ఉత్తర్‌ప్రదేశ్‌లో 27కు చేరాయి. గుజరాత్‌లో మొత్తం 18 మందికి వైరస్ సోకగా.. ఓ 67ఏళ్ల వృద్ధుడు మృతిచెందారు. బిహార్‌లోనూ చనిపోయిన వ్యక్తికి కరోనా లక్షణాలున్నట్లు గుర్తించారు.